Reading Time: < 1 minute
Tdp Mahanadu 2026 Party Plans 20 Key Resolutions 4 Special Proposals From Telangana

TDP Mahanadu 2026: తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశాలపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ మహానాడులో దాదాపు 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టాలని పార్టీ నాయకత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో తీర్మానాల కమిటీ సమావేశం జరిగింది. యనమల రామకృష్ణుడు నేతృత్వంలో 17 మంది సభ్యులతో కూడిన కమిటీ సమావేశమై మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాలపై విస్తృతంగా చర్చించింది.

పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (NTR) జన్మదిన వేడుకలు, పార్టీ సంస్థాగత బలోపేతం, యువతకు ప్రోత్సాహం వంటి అంశాలపై ఉమ్మడి తీర్మానాలను తీసుకురావాలని కమిటీ భావిస్తోంది. అలాగే రాష్ట్ర రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై కూడా కీలక చర్చలు జరగనున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల అమలు, కేంద్ర ప్రభుత్వ మద్దతు, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్ల ఏర్పడుతున్న ఆర్థిక భారం, ప్రతిపక్షాల విధ్వంసక రాజకీయాలు, అభివృద్ధికి అడ్డంకులు వంటి అంశాలపై ప్రత్యేక తీర్మానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.

మహానాడులో చివరిగా రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ తీర్మానం కీలకంగా ఉండనుందని భావిస్తున్నారు. ఇక తెలంగాణకు సంబంధించిన అంశాలపైనా టీడీపీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. తెలంగాణ నుంచి నాలుగు ప్రత్యేక తీర్మానాలు తీసుకురావాలని ప్రాథమిక స్థాయిలో చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణలో పార్టీ బలోపేతం, రాజకీయ వ్యూహాలు, యువత ఆకర్షణ వంటి అంశాలు వీటిలో ఉండే అవకాశముంది. అయితే, మహానాడు నిర్వహణ, తీర్మానాల తుది రూపకల్పనపై కమిటీ మరోసారి సమావేశం కానుంది. ఎల్లుండి జరిగే టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశానికి ముందుగానే ఖరారు చేసిన తీర్మానాల వివరాలను పార్టీ అధిష్టానానికి సమర్పించనున్నట్లు సమాచారం.