Reading Time: < 1 minute
Ap Inter Results Error Lecturer Penalized After Student With 60 Marks Declared Failed

AP Inter Results Error: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన ఘోర నిర్లక్ష్యం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థినికి బోటనీ పరీక్షలో పూర్తి మార్కులు వచ్చినప్పటికీ, మూల్యాంకనంలో జరిగిన తప్పిదం కారణంగా ఆమెను ఫెయిల్‌గా ప్రకటించడం కలకలం రేపింది. ఈ ఘటనపై స్పందించిన ఇంటర్ బోర్డు సంబంధిత లెక్చరర్‌పై చర్యలు తీసుకుంది.

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన కర్లపూడి కావ్య ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోటనీ పరీక్ష రాసింది. పరీక్షలో ఆమెకు 60కి 60 మార్కులు వచ్చినప్పటికీ, మూల్యాంకనం చేసిన లెక్చరర్ ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ సమయంలో నిర్లక్ష్యం కారణంగా.. 60 మార్కులు నమోదు చేయాల్సిన చోట కేవలం 6 మార్కులు మాత్రమే నమోదు చేశారు. అనంతరం అదే ఓఎంఆర్ షీట్ స్కాన్ కావడంతో కంప్యూటర్ రికార్డుల్లో కూడా 6 మార్కులే నమోదయ్యాయి. ఫలితంగా పూర్తి మార్కులు సాధించిన విద్యార్థిని ఫెయిల్ అయినట్లు ఫలితాల్లో చూపించారు.

ఈ పొరపాటు కారణంగా కావ్య దాదాపు నెల రోజుల పాటు తీవ్ర మనోవేదనకు గురైంది. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ప్రక్రియ అనంతరం అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మార్చి 13న విడుదలైన సవరించిన ఫలితాల్లో ఆమెకు పూర్తి మార్కులు వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూల్యాంకనంలో ఇలాంటి నిర్లక్ష్యాలు విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష ఫలితాలపై ఆధారపడి విద్యార్థులు ఉన్నత చదువులు, కెరీర్ నిర్ణయాలు తీసుకుంటారని, ఇలాంటి పొరపాట్లు మానసిక ఒత్తిడికి దారి తీస్తాయని చెబుతున్నారు.

ఈ ఘటనపై స్పందించిన ఇంటర్ బోర్డు సంబంధిత లెక్చరర్‌కు రూ.7,500 జరిమానా విధించింది. అలాగే మూడేళ్లపాటు మూల్యాంకన విధుల నుంచి డిబార్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ చర్యలు సరిపోవని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత కఠిన చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న మూల్యాంకన ప్రక్రియలో అత్యంత జాగ్రత్త అవసరమని, బాధ్యతారాహిత్యానికి తావులేకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.