Reading Time: 2 minutes
Cricket Record Scorpion Cc Smashes 822 Runs Wins By Massive 794 Run Margin In Zimbabwe

Cricket Record: క్రికెట్ ప్రపంచంలో ఎన్నో అద్భుత మ్యాచ్‌లు చూసినా.. జింబాబ్వేలో జరిగిన ఈ మ్యాచ్ మాత్రం వేరే లెవెల్ అంతే. 2025-26 మస్వింగో 50 ఓవర్ ఫస్ట్ లీగ్‌లో స్కార్పియన్ క్రికెట్ క్లబ్, మెథేన్ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అసాధారణ స్కోర్లతో వార్తల్లో నిలిచింది. ఈ మ్యాచ్లో స్కార్పియన్ జట్టు ఏకంగా 50 ఓవర్లలో 822 పరుగులు చేసి రికార్డు సృష్టించగా, ప్రత్యర్థి మెథేన్ లయన్స్ కేవలం 28 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా స్కార్పియన్ జట్టు 794 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

టాస్ గెలిచిన స్కార్పియన్ కెప్టెన్ ప్రైజ్ మకాజా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు విల్‌ఫ్రెడ్ మటెండే, టకుందా మడెంబో మొదటి నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డారు. బౌండరీలు, సిక్సర్లతో స్కోర్‌బోర్డ్‌ను పరుగులు పెట్టించారు. విల్‌ఫ్రెడ్ మటెండే కేవలం 75 బంతుల్లోనే 23 ఫోర్లు, 13 సిక్సర్లతో 203 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక మరో ఓపెనర్ టకుందా మడెంబో అయితే ఏకంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. 143 బంతుల్లో 50 ఫోర్లు, 7 సిక్సర్లతో 302 పరుగులు చేసి వీర విహారం చేశాడు. సాధారణంగా వన్డేల్లో 300 పరుగులు జట్టు గెలుపుకు సరిపోతాయి. కానీ ఈ మ్యాచ్‌లో మడెంబో ఒక్కడే ఆ స్కోరును దాటేయడం విశేషం.

ఇక వీరిద్దరి తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా అదే దూకుడు కొనసాగించారు. విన్సెంట్ మొయో 39 బంతుల్లో 78 పరుగులు చేయగా, గాబ్రియెల్ జయా 49 బంతుల్లో అజేయంగా 110 పరుగులు చేశాడు. కెప్టెన్ మకాజా మాత్రం కేవలం 2 పరుగులకే పరిమితమయ్యాడు. ఇంత భారీ స్కోరుకు మెథేన్ లయన్స్ బౌలర్ల వైఫల్యమే ప్రధాన కారణమైంది. దీనికి తోడు 109 ఎక్స్‌ట్రాలు ఇచ్చారు. అందులో 79 వైడ్లు, 23 నోబాల్స్ ఉన్నాయి. ప్రతి బౌలర్ కూడా తమ స్పెల్‌లో 100కుపైగా పరుగులు ఇచ్చారు. అత్యంత ఎకానమీగా బౌలింగ్ చేసిన సిడ్నీ శుంబా కూడా ఓవర్‌కు 13.3 పరుగులు సమర్పించాడు.

మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపించిన పిచ్.. రెండో ఇన్నింగ్స్‌లో పూర్తిగా మారిపోయింది. 823 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెథేన్ లయన్స్ జట్టు స్కార్పియన్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక 28/7 వద్దే నిలిచిపోయింది. దీంతో క్రికెట్ చరిత్రలోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటి నమోదైంది. ఇది అధికారిక లిస్ట్-ఏ మ్యాచ్ కాకపోవడంతో ప్రపంచ రికార్డుగా పరిగణించబడకపోయినా.. ఈ స్కోర్‌కార్డ్ ను మాత్రం క్రికెట్ అభిమానులు నమ్మలేకపొతున్నారు. ప్రస్తుతం అధికారిక లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక జట్టు స్కోరు బిహార్ పేరిట ఉంది. విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై బిహార్ జట్టు 574 పరుగులు చేసింది.