
విదేశాలకు వెళ్లే ప్లాన్‌లో ఉన్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. దేశంలో టాటాలకు చెందిన దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ సర్వీసులకు భారీగా కత్తెర వేసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ఆకాశాన్నంటుతున్న విమాన ఇంధన ధరలు, గగనతల ఆంక్షల నేపథ్యంలో పలు విదేశీ రూట్లలో విమానాలను తాత్కాలికంగా రద్దు చేయడమే కాకుండా.. సర్వీసుల సంఖ్యను సగానికి సగం తగ్గించేసింది. జూన్ నుంచి ఆగస్టు వరకు అమల్లో ఉండే ఈ కొత్త నిర్ణయం ప్రయాణికులపై పెను ప్రభావం చూపనుంది.
ఎందుకీ కోత?
ప్రస్తుతం కొన్ని దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు, గగనతల ఆంక్షల కారణంగా విమానాలు ప్రయాణించాల్సిన దూరం పెరిగింది. దీనికి తోడు విమాన ఇంధన ధరలు పెరగడంతో ఆపరేషన్ ఖర్చులు విమానయాన సంస్థలకు భారంగా మారాయి. అందుకే నెట్‌వర్క్ స్థిరత్వం కోసం ఈ రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది.
ప్రధానంగా ప్రభావితమైన రూట్ల వివరాలు ఇవే:
ఉత్తర అమెరికా:
* ఢిల్లీ-చికాగో: విమానాలు తాత్కాలికంగా రద్దు.
* ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో: వారానికి 10 నుంచి 7కి తగ్గింపు.
* ఢిల్లీ-న్యూయార్క్ & ముంబై-నెవార్క్: సర్వీసులు రద్దు. అయితే ముంబై-నెవార్క్ మధ్య విమానాలను 3 నుంచి 7కి పెంచారు.
యూరప్:
* ఢిల్లీ-పారిస్: వారానికి 14 విమానాలు ఉండగా, ఇప్పుడు కేవలం 7కి తగ్గించారు.
* కోపెన్‌హాగన్, మిలన్, వియన్నా, జ్యూరిచ్, రోమ్: ఈ నగరాలకు వెళ్లే విమానాల సంఖ్యను భారీగా తగ్గించారు.
ఆస్ట్రేలియా:
* మెల్‌బోర్న్, సిడ్నీలకు వారానికి 7 సర్వీసులు ఉండగా.. వాటిని 4కి కుదించారు.
ఫార్ ఈస్ట్, ఆగ్నేయాసియా సార్క్ దేశాలకు విమాన సేవలు:
* ఢిల్లీ – షాంఘై: ఆగస్టు వరకు విమాన సర్వీసులు తాత్కాలికంగా రద్దు.
* ఢిల్లీ – సింగపూర్: వారానికి 24 సర్వీసుల నుంచి 14కి తగ్గింపు.
* ముంబై – సింగపూర్: వారానికి 14 సర్వీసుల నుండి 7కి తగ్గింపు.
* చెన్నై – సింగపూర్: ఆగస్టు వరకు విమాన సర్వీసులు తాత్కాలికంగా రద్దు.
* ఢిల్లీ – బ్యాంకాక్: జూలై నుండి వారానికి 28 సర్వీసుల నుండి 21కి తగ్గింపు.
* ముంబై – బ్యాంకాక్: జూలై నుండి వారానికి 13 సర్వీసుల నుండి 7కి తగ్గింపు.
* ఢిల్లీ – కౌలాలంపూర్: వారానికి 10 సర్వీసుల నుండి 5కి తగ్గింపు.
* ఢిల్లీ – హో చి మిన్ సిటీ: జూలై, ఆగస్టు నెలల్లో వారానికి 7 సర్వీసుల నుండి 4కి తగ్గింపు.
* ఢిల్లీ – హనోయి: జూలై, ఆగస్టు నెలల్లో వారానికి 5 సర్వీసుల నుండి 4కి తగ్గింపు.
* ఢిల్లీ – కాఠ్‌మాండూ: జూన్ నెలలో వారానికి 42 సర్వీసుల నుండి 28కి.. అలాగే జూలై, ఆగస్టు నెలల్లో 21కి తగ్గింపు.
* ఢిల్లీ – ఢాకా: వారానికి 7 సర్వీసుల నుండి 4కి తగ్గింపు.
* ముంబై – ఢాకా: ఆగస్టు వరకు విమాన సర్వీసులు తాత్కాలికంగా రద్దు.
* ముంబై – కొలంబో: వారానికి 7 సర్వీసుల నుండి 4కి తగ్గింపు.
* ఢిల్లీ – కొలంబో: వారానికి 14 సర్వీసుల నుండి 12కి తగ్గింపు.
* ఢిల్లీ – మాల్దీవులు: ఆగస్టు వరకు విమాన సర్వీసులు తాత్కాలికంగా రద్దు.
ప్రయాణికుల పరిస్థితి ఏంటి?
ముందే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఈ మార్పుల గురించి సమాచారం అందిస్తామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. వారికి రీషెడ్యూలింగ్ ఆప్షన్లతో పాటుగా పూర్తి రిఫండ్ అందజేస్తామని తెలిపింది. ఆఖరి నిమిషంలో ఇబ్బందులు కలగకుండా ఉండటానికే ఈ ముందస్తు సర్దుబాట్లు చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఎయిర్ ఇండియా నిర్ణయంతో విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారు తమ ఫ్లైట్ స్టేటస్‌ను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.