Reading Time: 2 minutes
Shreyas Iyer Admits Planning Mistakes After Pbks Defeat Vs Dc In Ipl 2026

Shreyas Iyer on PBKS Loss vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026 ప్రథమార్ధంలో అద్భుత ఆటతో దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్.. రెండో అర్ధ భాగంలో ఊహించని పరాజయాలను ఎదుర్కొంటోంది. వరుసగా నాలుగో ఓటమితో ప్లేఆఫ్స్‌ కోసం పోరాడాల్సిన స్థితి వచ్చింది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని ఢిల్లీ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కీలక మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసినప్పటికీ జట్టు ఓటమిపాలవడంతో.. మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ తన బౌలింగ్ వ్యూహాలపై నిజాయితీగా స్పందించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో చేసిన పొరపాట్లు, సరైన ప్లానింగ్ లేకపోవడం జట్టు ఓటమికి కారణమైందని అంగీకరించాడు.

మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘ఈ వికెట్‌పై 210 పరుగులు చాలా ఎక్కువ. బంతి బాగా సీమ్ అవుతోంది. బౌన్స్ కూడా స్థిరంగా లేదు. ఈ పరిస్థితుల్లో 210 అనేది కనీసం 30 పరుగులు ఎక్కువ స్కోరే’ అని తెలిపాడు. మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు ఎందుకు ఓవర్ ఇవ్వలేదన్న ప్రశ్నకు అయ్యర్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘చాహల్‌ను మిడిల్ ఓవర్లలో బౌలింగ్‌కు తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. కానీ పిచ్ సీమర్లకు బాగా సహకరిస్తోంది. మా పేసర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తే వికెట్లు వస్తాయని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ అలా జరగలేదు’ అని చెప్పాడు.

డెత్ ఓవర్లలో యార్కర్లు ఎందుకు ప్రయత్నించలేదని అడగగా.. ‘మేము ఇంకా హార్డ్ లెంగ్త్‌కే కట్టుబడి ఉన్నాం. కొత్త బ్యాటర్ వచ్చినప్పుడు షార్ట్ ఆఫ్ హార్డ్ లెంగ్త్ బంతులు వేయడం ఉత్తమం అని నేను నమ్ముతాను. అలాంటి బంతులను వరుసగా వేస్తే.. ఎప్పుడో ఒకసారి మిస్ హిట్ వస్తుంది. అక్కడ వికెట్ దక్కే అవకాశం ఉంటుంది’ అని శ్రేయస్ అయ్యర్ వివరించాడు.

అయితే చివరికి తమ వ్యూహాలే విఫలమయ్యాయని పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ ఒప్పుకున్నాడు. ‘మా ప్లానింగ్‌లో లోపం ఉంది. ఎగ్జిక్యూషన్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. అదే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసింది’ అని పేర్కొన్నాడు. అయ్యర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు మాత్రం బౌలింగ్ మార్పుల విషయంలో కెప్టెన్సీ పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శిస్తున్నారు.