
Wedding Drama: ఈ మధ్య పీటల వరకు వచ్చి వివాహాలు ఆగిపోవడం చాలా కామన్‌గా మారింది. తాజాగా అలాంటి ఘటననే వారణాసి పరిధిలో చోటు చేసుకుంది. వారణాసిలోని ఛితౌనీ గ్రామంలో జరిగిన ఒక పెళ్లి వేడుక ఊహించని మలుపులతో సినిమా సీన్‌ను తలపించింది. బాజాభజంత్రీలు, బంధువుల సందడి మధ్య వధువు కిరణ్ రాజ్‌భర్ మెడలో వరుడు వరమాల వేయబోయే సరికి అసలు డ్రామా మొదలైంది. పెళ్లి పీటల మీద ఉన్న వధువు ఒక్కసారిగా కిందకు దిగి, గుంపులో నిలుచున్న తన ప్రియుడు పవన్ వైపు పరుగెత్తుకెళ్లి.. “పెళ్లంటూ చేసుకుంటే ఇతడినే చేసుకుంటా” అని తెగేసి చెప్పడంతో పెళ్లి మండపంలోని బంధు మిత్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వరుడి తరపున బంధువులు ఆగ్రహంతో ప్రియుడిపై దాడికి దిగగా, వధువు అతడికి అడ్డుగా నిలబడి తన ప్రేమను అందరి ముందూ చాటుకుంది.
అసలు ఏం జరిగిందంటే..?
పారస్ రాజ్‌భర్ కుమార్తె కిరణ్ రాజ్‌భర్ చోళాపూర్ ప్రాంతంలోని భర్తౌలి గ్రామానికి చెందిన పవన్‌తో ప్రేమలో ఉండేది. వారిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ కిరణ్ కుటుంబం ఆమెకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించింది. బహుశా తన ప్రేయసిని చివరిసారిగా చూసేందుకు కాబోలు, పవన్ ఆ పెళ్లి వేడుకకు నిశ్శబ్దంగా హాజరయ్యాడు. ఇంతలో పెళ్లి మండపంపై నిలబడి ఉన్న కిరణ్, పవన్‌ను గమనించింది. ఇంతలో పెళ్లి కొడుకు ఆమె మెడలో దండ వేయడానికి ప్రయత్నించగా.. ఒక్కసారిగా వేదిక నుంచి కిందికి దిగింది పెళ్లి కుమార్తె. గుంపులోని తన లవర్ పవన్ దగ్గరకు వెళ్లి తాను అతడినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టుకు కూర్చుంది. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత నచ్చజెప్పినా కిరణ్ తన పట్టు వీడకపోవడంతో చేసేదేమీ లేక వరుడు వెనుదిరిగాడు. ఈ వ్యవహారం కాస్తా పోలీసు స్టేషన్‌కు చేరింది. అక్కడ గంటల తరబడి జరిగిన పంచాయితీలోనూ వధువు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. చివరికి ఇరు కుటుంబాలు రాజీకి వచ్చి, ప్రేమికులిద్దరికీ పెళ్లి చేయడమే మేలని భావించారు. అలా ఆ గ్రామంలోని ఒక దేవాలయంలో కిరణ్, పవన్‌ల వివాహం ఘనంగా జరిగింది. ఒకరి కోసం వచ్చిన బారాత్ ఖాళీగా వెనుదిరిగినా అదే మండపంలో ఓ ప్రేమ కథ సుఖాంతం కావడంతో ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది.