Reading Time: < 1 minute
Cyber Crime Warning Free Movie Malware App Scam Cyberabad Police

ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు సరికొత్తగా ఎర వేస్తూ సామాన్యులను దోచుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి అడుగు వేస్తే, జీవితాంతం సంపాదించిన సొమ్ము ఆవిరైపోతుందని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక ఘటన షాక్ కలిగిస్తోంది. ఒక వ్యక్తి ఫేస్‌బుక్ బ్రౌజ్ చేస్తుండగా, “లేటెస్ట్ సినిమాలు ఫ్రీగా చూడండి – ఇప్పుడే Tubi TV యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి” అనే ప్రకటన కనిపించింది. ఆ ఆసక్తితో ఆయన అందులోని లింక్‌ను క్లిక్ చేయగా, అది ఒక వెబ్‌సైట్‌కు తీసుకెళ్లింది. అక్కడ నుంచి ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, సినిమా కూడా చూశారు. అంతా మామూలుగానే ఉందని భావిస్తున్న సమయంలోనే అసలు ప్రమాదం మొదలైంది.

కొంతసేపటికి మొబైల్ సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతున్నట్లు మెసేజ్ వచ్చింది. అది సాధారణ అప్‌డేట్ అని ఆయన అనుకున్నారు. కానీ, కొన్ని నిమిషాల తర్వాత ఫోన్ సరిగా పనిచేయకపోవడం, యూపీఐ సేవలు మొరాయించడం వంటి సమస్యలు తలెత్తాయి. అనుమానం వచ్చి బ్యాంక్ అకౌంట్ తనిఖీ చేయగా, తన ఖాతా నుండి ₹80,000, అదే ఫోన్‌లో లాగిన్ అయి ఉన్న తన తల్లి ఖాతా నుండి మరో ₹95,000 మాయమయ్యాయి. ఇలా కేవలం ఒకే ఒక్క తప్పుడు యాప్ వల్ల మొత్తం ₹1,75,000 కోల్పోవాల్సి వచ్చింది.

నిజానికి డౌన్‌లోడ్ చేసిన ఆ యాప్ అసలైన “Tubi TV” కాదు. అది అదే పేరుతో రూపొందించిన ఒక ప్రమాదకరమైన Malware అప్లికేషన్. ఈ మాల్వేర్ ఫోన్‌లోకి ప్రవేశించి, వచ్చే ఎస్ఎంఎస్ (SMS),ఓటీపీ (OTP)లను రహస్యంగా చదువుతుంది. బ్యాంకింగ్ యాప్స్‌పై నియంత్రణ సాధించి, మీకు తెలియకుండానే డబ్బును తరలిస్తుంది. అందుకే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికలపై వచ్చే “Free Movie” లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు. గుర్తు తెలియని వెబ్‌సైట్ల నుండి యాప్స్ డౌన్‌లోడ్ చేయకండి. కేవలం అఫీషియల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ మాత్రమే వాడండి. అనవసరమైన యాప్‌లకు మీ మెసేజ్లు లేదా గ్యాలరీని చూసే పర్మిషన్స్ ఇవ్వకండి.