
AP Weather Alert: ఇప్పటికే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉంది. అలాగే ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తా జిల్లాలతో పాటు నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వర్షాలతో పాటు పిడుగులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఇక, సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఏలూరు జిల్లా తడువైలో 71.5 మిల్లీమీటర్లు, పల్నాడు జిల్లా రెంటచింతలలో 42 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లా ఘంటసాలలో 41.5 మిల్లీమీటర్లు, మార్కాపురం జిల్లా బోట్లగూడూరులో 40 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లా పలమనేరులో 38 మిల్లీమీటర్లు, నెల్లూరు జిల్లా చిన్నమాచానేరులో 33 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.