Reading Time: 2 minutes
Vaibhav Sooryavanshi Dropped Krishnamachari Srikkanths Wife Reacts

Krishnamachari Srikkanth’s Wife on Vaibhav Sooryavanshi Dropped: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులో అండించలేదు. బుడ్డోడికి బదులుగా సీనియర్ ప్లేయర్ సంజు శాంసన్ బరిలోకి దిగాడు. వైభవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోకపోవడంపై మాజీ భారత క్రికెటర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత టీ20 సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన వైభవ్‌ను పక్కన పెట్టి సంజును ఆడించడాన్ని ప్రశ్నించారు. బాగా ఆడుతున్న వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు? అని తన సతీమణి ప్రశ్నించిందని శ్రీకాంత్ చెప్పారు.

నేను క్రికెట్ మ్యాచ్ చూడను:

తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన క్రిస్ శ్రీకాంత్.. వైభవ్‌ సూర్యవంశీని ఆడించకపోవడంతో తన భార్య కూడా ఆశ్చర్యపోయిందని చెప్పుకొచ్చారు. ‘ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి టీ20లో వైభవ్‌ ఆడలేదు. ప్లేయింగ్ 11 చూసి నా భార్య షాక్ అయింది. నేను మ్యాచ్ చూడనని చెప్పింది. మ్యాచ్‌కు బదులుగా ఇంట్లో సినిమా చూశాం. వైభవ్ ఎందుకు ఆడటం లేదని నా భార్య ప్రశ్నిస్తూ వాదించింది. గత మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన ఆటగాడిని వెంటనే పక్కన పెట్టడం సరికాదని ఆమె కూడా అభిప్రాయపడింది’ అని శ్రీకాంత్ వెల్లడించారు.

మళ్లీ నన్ను తప్పిస్తారా?:

వైభవ్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ సరిగ్గా ప్రోత్సహించడం లేదని శ్రీకాంత్ విమర్శించారు. ‘ఒక మ్యాచ్‌లో ఆడించి, ఆ తర్వాత పక్కన పెట్టడం వల్ల యువ ఆటగాడిలో అనవసరమైన సందేహాలు ఏర్పడతాయి. తదుపరి మ్యాచ్‌లో అవకాశం వచ్చినప్పుడు కూడా ఈ మ్యాచ్‌లో విఫలమైతే మళ్లీ నన్ను తప్పిస్తారా? అనే ఆలోచన అతడిలో కలిగే అవకాశం ఉంది. దులీప్ ట్రోఫీ నుంచి టీ20 క్రికెట్, ఇండియా-ఏ, ఐపీఎల్ వరకు వైభవ్ తన ప్రతిభను చాటుకున్నాడు. ఇలాంటి ఆటగాడిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అతడికి వరుసగా కొన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించాలి. ఇలా తరచూ జట్టులోకి తీసుకోవడం, తప్పించడం ద్వారా ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి’ అని పేర్కొన్నారు.

సంజును చూస్తే జాలేస్తోంది:

సంజు శాంసన్ విషయంలోనూ టీమ్ మేనేజ్‌మెంట్ తీరును క్రిస్ శ్రీకాంత్ తప్పుబట్టారు. ‘2026 టీ20 ప్రపంచ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచిన సంజు ప్రస్తుతం ఫామ్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. జట్టులోకి వస్తూ, వెళ్తూ ఉన్నాడు. టీమ్ మేనేజ్‌మెంట్ సంజుతో ఆడుకుంటోంది. అతడిని చూస్తే జాలేస్తోంది. ఒకవేళ సంజుపై నమ్మకం ఉంటే అతడికి వరుసగా కొన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇవ్వాలి. లేదంటే వైభవ్ సూర్యవంశీకి కూడా వరుసగా అవకాశాలు ఇవ్వాలి. ఇద్దరిని రెండు మ్యాచ్‌లు ఆడించి, మళ్లీ పక్కన పెట్టడం మంచిది కాదు’ అని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి టీ20లో సంజు కేవలం 10 పరుగులకే ఔటయ్యాడు. దీంతో ఈరోజు జరగనున్న రెండో టీ20లో టీమ్ మేనేజ్‌మెంట్ ఎవరికి అవకాశం ఇస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.