
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మరోసారి సామాజిక అంశంపై తనదైన శైలిలో స్పందించారు. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఘటనపై సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతూ, మమతా బెనర్జీ ఓటమిపై ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆ దారుణాన్ని మర్చిపోలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పారని నిఖిల్ సోషల్ మీడియా వేదికగా అన్నారు.
“ పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆ విషయాన్ని మర్చిపోలేదు, క్షమించనూ లేదు. సామాన్య ప్రజల పట్ల శ్రద్ధ చూపని ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం నేర్పారు.” అంటూ ఆయన తన పోస్టులో వ్యాఖ్యానించారు. బాధితురాలికి న్యాయం జరగాలని కోరుతూ హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జోడించారు. లేటెస్ట్గా వచ్చిన ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. నిఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
The People of West Bengal did not forget or forgive . They Taught a lesson to the Govt which did not care for the Common Person .
Justice for RG KAR Medical college Horror . #RGKAR #Kolkata https://t.co/ydOioIZBdH— Nikhil Siddhartha (@actor_Nikhil) May 4, 2026
ఇదే విషయంపై 2024 ఆగస్టులో విడుదల చేసిన వీడియోను కూడా ఆయన తిరిగి ప్రస్తావించారు. ఆ సమయంలో వైద్యుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన నిఖిల్, నిందితులకు కఠిన శిక్ష విధించాలని, కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇక విచారణ లోపం, జాప్యం రెండూ ఎదురురవ్వడంతో మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఒక నటుడిగా కాకుండా బాధ్యతాయుతమైన పౌరుడిగా నిఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాయి.
మమత భారీ పరాభవం..
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వరుసగా మూడుసార్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మమతా బెనర్జీ నేతృత్వంలోనే తృణమూల్ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి కేవలం 79 సీట్లకే పరిమితమైంది. మమత కూడా తాను పోటీ చేసిన భవానీపూర్ లో ఓటమి పాలయ్యారు.
మమత తన సమీప ప్రత్యర్థి.. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15 వేల 105 ఓట్ల తేడాతో పరాభవం చవిచూశారు.దక్షిణ కోల్‌కతాలో చాలాకాలంగా తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న భవానీపూర్ ఈసారి బీజేపీ చేతుల్లోకి వెళ్లింది. సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓడిపోవడం ఇది రెండవసారి. 2021లో, ఆమె నందిగ్రామ్‌లో కేవలం 2 వేల ఓట్ల తేడాతో అతని చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ సువేందు అధికారి చేతిలోనే ఆమె ఓటమిని చవిచూశారు.
నిఖిల్ స్వయంభు:
ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ ‘స్వయంభు’ మరియు ‘కార్తికేయ 3’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. సమ్మర్ కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ‘స్వయంభు’, నిఖిల్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది. ఇందులో నిఖిల్ యోధుడుగా కనిపించనున్నాడు. ‘స్వయంభు’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఒక దృశ్య కావ్యంగా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం టాలీవుడ్‌లో దిగ్గజ సాంకేతిక నిపుణులు పనిచేశారు. ‘మగధీర’, ‘బాహుబలి’, ‘RRR’ వంటి విజువల్ వండర్స్‌ను అందించిన సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.