
వేసవికాలం వచ్చిందంటే.. చాలామంది చలివేంద్రాలు ఏర్పాటుచేస్తారు. పెద్ద పెద్ద కుండలతో నీటిని నింపి నగరాల్లో, పల్లెల్లో కూడా ప్రయాణికులు, పాదచారులు, వాహనదారులకు అనుకూలంగా ఏర్పాటుచేస్తారు. ఎందరో ఆ చల్లని నీటిని త్రాగి దాహార్తిని తీర్చుకుంటారు. మననుషులకే కాదు, పశుపక్ష్యాదులు కూడా నీళ్లు తాగేలా ఏర్పాట్లు చేస్తారు. ఇది మానవ ధర్మం.. కనీస మానవత్వం. అయితే ఓ వ్యక్తి మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించాడు. గ్రామస్తుల దాహార్తిని తీర్చే బోరుకి తాళం వేసాడు. మండుటెండలో గొంతు ఎండిపోతుంటే, దాహం తీర్చుకోవడానికి చుక్క నీరు దొరకకపోతే ఎంత దారుణం? అల్లూరి సీతారామరాజు జిల్లాలో కక్ష సాధింపు చర్యలు పరాకాష్టకు చేరాయి. ఒక వర్గం వారిపై పగ తీర్చుకోవడానికి ప్రత్యర్థులు ఏకంగా గ్రామస్తుల దాహార్తిని తీర్చే తాగునీటి బోరుకే తాళం వేశారు. చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీ బురడ వీధిలో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో రెండు వర్గాల మధ్య ఉన్న భూ వివాదాలు ఇప్పుడు తాగునీటి కష్టాలకు దారితీశాయి. ప్రత్యర్థి వర్గాన్ని ఇబ్బంది పెట్టాలని చూసిన కొందరు, పక్కా పథకం ప్రకారం రోడ్డు పక్కన ఉన్న సామాజిక బోరుకు ఐరన్ గొలుసు వేసి తాళం వేశారు. దీంతో గ్రామస్తులతో పాటు, వేసవిలో ఆ దారిలో వెళ్లే బాటసారులు కూడా నీరు లేక అల్లాడిపోతున్నారు. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి వచ్చి తాళాలు తొలగించినా, ఫలితం లేకపోయింది. ఆమె వెళ్లిన కొద్దిసేపటికే మళ్ళీ బోరుకు తాళం పడటంతో గ్రామస్తులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. “పూర్వీకుల నాటి భూ గొడవలను తమ నీళ్ల కోసం వాడుకుంటున్నారని, కక్షలు ఏవైనా, తమ దాహార్తిని తీర్చే నీటిని ఆపడం సరికాదని గ్రామస్థుడు తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు పోలీసులవద్దకు చేరింది. కక్ష సాధింపు కోసం సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: