Reading Time: < 1 minute
IPL 2026: కాటేరమ్మ కొడుకుల ఊచకోత.. సొంతగడ్డపై ముంబైను చిత్తు చేసిన హైదరాబాద్

ఐపీఎల్‌ 2026లో భాగంగా బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన 41వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఏకంగా తన సొంతగడ్డపైనే ముంబైను ఉతికి ఆరేసింది. ముంబై అందించిన భారీ టార్గెట్‌ను సైతం సునాయసంగా 6 వికెట్ల తేడాతో ఛేదించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 55 బంతుల్లోనే 123 పరుగులుతో చేసి భారీ స్కోరు అందించాడు. అతనికి తోడుగా విల్ జాక్స్ సైతం 46 పరుగులు చేసి సన్‌రైజర్స్‌ ముందు భారీ టార్గెట్‌ను ఉంచారు.

ఇక ముంబై ఇచ్చిన భారీ టార్గెట్‌ ఛేదించేందుకు రంగంలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ 243 పరుగుల భారీ టార్గెట్‌ను ఈజీగా ఛేజ్ చేసింది. ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించేసింది. అయితే ఆరంభం నుంచే ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు హైదరాబాద్ ఓపెనర్స్. ఓపెన్లరుగా వచ్చిన అబిషేక్ షర్మ , ట్రావిస్ హెడ్ అదిరిపోయే స్టార్టింగ్ ఇచ్చారు. కేవలం 30 బంతుల్లో 8 సిక్సర్లు, 6 ఫోర్లతో 76 పరుగులు చేసి ట్రావిస్ హెడ్‌ స్కోర్‌ బోర్డును హై స్పీడ్‌లో ముందుకు తీసుకెళ్లాడు. అటు అభిషేక్ సైతం పవర్‌ప్లేలో హెడ్‌తో కలిసి విధ్వంసం సృష్టించాడు. వీరిద్దరూ కలిసి పవర్‌ప్లేలో 92 పరుగులు చేయగా.. తర్వాత వచ్చిన క్లాసెన్ 22 బంతుల్లోనే 50 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

అయితే ఇంత భారీ స్కోర్‌ను చేజ్ చేయడం ఐపీఎల్ చరిత్రలోనే ఇది 4వ సారి. ఇక వరుస విజయాలతో ఊపు మీదున్న హైదరాబాద్‌ ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకొని ఆరు విజయాలు తొమ్మిది ఓటమిలతో ప్రస్తుతం 3వ ప్లేస్‌లో కొనసాగుతుంది. అటు ముంబై ఇండియన్స్‌కు మాత్రం వరుస ఓటములతో ప్లే-ఆఫ్ అవకాశాలు చేజార్చుకుంటుంది.ఈ సీజన్‌లో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం 2 విజయాలు మాత్రమే సాధించి, 7 ఓటములతో పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానానికి పడిపోయింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.