
క్రెడిట్ కార్డులు వాడేవారికి భారీ గుడ్ న్యూస్. క్రెడిట్ బిల్లులకు ఆర్బీఐ మూడు రోజుల గ్రేస్ పీరియడ్ నిబంధన విధించింది. దీంతో మీ క్రెడిట్ కార్డు బిల్లు గడువు తేదీ ముగిసినా మూడు రోజుల వరకు మీకు టైమ్ ఉంటుంది. ఈ మూడు రోజుల వరకు ఎలాంటి అదనపు ఛార్జీలు, ఆలస్యపు రుసుంలు విధించరు. ఈ మేరకు ఆర్బీఐ కొత్త నిబంధనలను బ్యాంకులు, క్రెడిట్ కార్డులు జారీ చేసే ఆర్ధిక సంస్థలకు విధించింది. ఆర్బీఐ సవరణ ఆదేశాలు-2026 ద్వారా ఈ నిబంధనలను అమలు చేయనుంది. క్రెడిట్ బిల్లు గడువు తేదీ ముగిశాక కార్డుదారుడికి వెంటనే ఆలస్య రుసుంలు విధించడానికి వీల్లేదు. మూడు రోజుల సమయం ఇవ్వాలి. ఆ తర్వాత ఛార్జీలు విధించవచ్చు.
మూడు రోజుల గ్రేస్ పీరియడ్
క్రెడిట్ కార్డు బిల్లు డ్యూ డేట్ ముగిశాక మూడు రోజుల వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత కూడా చెల్లించకపోతే గడువు దాటినట్లు ఆర్ధిక సంస్థలు పరిగణించాలి. మూడు రోజుల తర్వాతనే లేట్ ఫీజులు, ఇతర జరిమానాలు విధించాలి. కార్డ్ జారీదారుల రిపోర్టింగ్, ఛార్జీలలో స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు ఇది సహాయపడుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి. వినియోగదారుల ఛార్జీలను లెక్కించడం, కార్డు జారీదారుల జాప్యాలను నివేదించడంలో ప్రమాణీకరించడమే లక్ష్యంగా ఈ కొత్త నియమాలు తీసుకొచ్చారు. ఇక లేట్ ఫీజులు లెక్కించే విధానాన్ని కూడా ఆర్బీఐ కఠినతరం చేసింది. గడువు తేదీ ముగిశాక చెల్లించని బకాయి మొత్తంపై మాత్రమే ఛార్జీలు విధించాల్సి ఉంటుంది. నెలవారీ స్టేట్‌మెంట్ మొత్తం బకాయిపై విధించకూడదు.
ఆర్బీఐ కీలక ఆదేశాలు
చెల్లించని బ్యాలెన్స్‌కు మాత్రమే కార్డుదారులకు లేట్ ఫీజులు విధించాలి. ఇప్పటివరకు బ్యాంకులతో పాటు క్రెడిట్ కార్డులను జారీ చేసే ఆర్ధిక సంస్థలు గడువు తేదీ ముగిసిన తర్వాతి రోజు నుంచే ఛార్జీలను విధిస్తున్నాయి. దీని వల్ల కస్టమర్లపై భారం పడుతోంది. సిబిల్ స్కోర్ తగ్గడంతో పాటు కస్టమర్లపై ఆలస్యపు రుసుంల వల్ల అదనపు భారం పడుతుంది. ఇప్పుడు వీటిపై ఆర్బీఐ కస్టమర్లకు ఊరట కలిగించింది. మూడు రోజుల గ్రేస్ పీరియడ్ నిబంధన వల్ల ఆలస్యంగా చెల్లించినా లేట్ ఫీజులు అనేవి ఉండవు. క్రెడిట్ కార్డు బిల్లు టైమ్‌కు చెల్లించకపోతే బ్యాంకులు పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తున్నాయి. దీని వల్ల కస్టమర్లు నష్టపోతున్నారు. ఈ కొత్త రూల్స్‌తో కస్టమర్లకు ఊరట కలగనుంది.