Reading Time: 2 minutes
Delhi Irs Officer Daughter Murder Case Rahul Arrested Shocking Details

దేశ రాజధాని ఢిల్లీలో సీనియర్ ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. బుధవారం ఉదయం కుమార్తె విగతజీవిగా పడి ఉండడంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు. స్థానికంగా కూడా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి డాగ్ స్క్వాడ్స్‌తో తనిఖీలు నిర్వహించారు. అలాగే సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా పరిశీలించారు. సీసీకెమెరాల్లో రికార్డైన ఆధారాలతో ద్వారకా ప్రాంతంలో ఓయో హోటల్‌లో నక్కిన నిందితుడు రాహుల్‌(19)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నిందితుడు రాహుల్.. ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్యాచారానికి కొన్ని గంటల ముందు రాజస్థాన్‌లోని అల్వార్ ప్రాంతంలో ఒక మహిళపై అత్యాచారం చేసినట్లుగా దర్యాప్తులో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నిందితుడి బ్యాగ్రౌండ్‌పై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకెన్ని నేరాలు చేశాడన్న విషయాలపై కూపీ లాగుతున్నారు.

బుధవారం ఆగ్నేయ ఢిల్లీలోని తూర్పు కైలాష్ ప్రాంతంలో ఐఆర్ఎస్ అధికారి కుమార్తె (22)పై అత్యాచారం చేసి హత్యకు గురైంది. ఆ సమయంలో తల్లిదండ్రులు జిమ్‌కు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేటప్పటికీ కుమార్తె విగతజీవిగా పడి ఉంది. దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీకెమెరాలను జల్లెడ పట్టారు. సీసీకెమెరాలో నిందితుడి కదలికలు కనిపించాయి. బాధిత కుటుంబానికి చూపించగా మాజీ పనిమనిషిగా గుర్తించారు. డాగ్‌ స్క్వాడ్స్‌.. ఇరుగుపొరుగు పనివాళ్ల సమాచారంతో నిందితుడు రాహుల్‌ను ఓయో హోటల్‌లో అరెస్ట్ చేశారు.

బాధితురాలు.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేసింది. ప్రస్తుతం యూపీఎస్సీకి సిద్ధమవుతోంది. అయితే నిందితుడు రాహుల్ నెలన్నర క్రితం వరకు ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో పని చేశాడు. ఐఆర్ఎస్ అధికారి కార్యాలయంలోని ఒక సూపరింటెండెంట్ ఇచ్చిన సిఫార్సుతో రాహుల్‌ను నియమించుకున్నారు. అయితే అతడి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఇరుగుపొరుగు ఇళ్లల్లో పని చేస్తున్నవారి దగ్గర నుంచి కూడా అప్పులు తీసుకోవడం.. తిరిగి ఇవ్వకపోవడం వంటి ఫిర్యాదులు కూడా ఉన్నాయి. వారి ఇచ్చిన సమాచారం మేరకు నిందితుడిని గంటల వ్యవధిలోనే హోటల్‌లో అరెస్ట్ చేశారు.

నిందితుడు రాహుల్‌ను విచారించగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలో అధికారి కుమార్తెపై అత్యాచారం, హత్య చేయడానికి కొన్ని గంటల ముందు రాజస్థాన్‌లోని అల్వార్ ప్రాంతంలో పరిచయస్థురాలైన వివాహిత మహిళపై అత్యాచారం చేశాడు. బాధితురాలి భర్తతో రాహుల్‌కు స్నేహం ఉండడంతో తరుచుగా ఇంటికి వస్తుండే వాడు. బాధితురాలితో ఆన్‌లైన్ గేమ్ ఆడుతుండేవాడు.. ఈ క్రమంలోనే మహిళపై అత్యాచారం చేశాడని.. ఈ విషయం బాధితురాలు భర్తకు తెలియడంతో భయంతో రాహుల్ ఢిల్లీకి వచ్చేశాడు.

అయితే ఐఆర్ఎస్ అధికారి ఇంటి విషయాలు నిందితుడికి క్షుణ్ణంగా తెలుసు. భార్యతో కలిసి అధికారి ఉదయాన్ని వాకింగ్, జిమ్‌కు వెళ్తారన్న విషయం తెలియడంతో నేరుగా ఇంటికి వచ్చేశాడు. ఆ సమయంలో అధికారి కుమార్తె ఒంటరిగా ఉంది. అయితే పరిచయమైన వ్యక్తే కదా? అని డోర్ తీసిందో.. ఏం జరిగిందో తెలియదు గానీ… ఒంటరిగా ఉన్న అధికారి కుమార్తెపై అత్యాచారం చేసి అనంతరం మొబైల్ ఛార్జింగ్ కేబుల్‌తో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. నిందితుడు బలవంతంగా ఇంట్లోకి వెళ్లినట్టుగా పోలీసులకు ఆనవాళ్లు లభించలేదు. దీంతో అదనపు తాళంతో ఇంట్లోకి ప్రవేశించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

బాధితురాలు డీపీఎస్ ఆర్కే పురంలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. అనంతరం ఐఐటీ ఢిల్లీ నుంచి పట్టభద్రురాలైంది. ప్రస్తుతం యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతోంది. నృత్యకారిణి కూడా. నృత్య పోటీల్లో అనేక అవార్డులు కూడా గెలుచుకుంది. ఆమె అన్నయ్య ఒక బహుళజాతి సంస్థలో ఉన్నత పదవిలో ఉన్నాడు. తల్లి వైద్యురాలు.