Reading Time: 2 minutes
Rajnath Singh Bengal Election Campaign Double Engine Growth Bjp Majority

డబుల్ ఇంజిన్‌తోనే బెంగాల్ అభివృద్ధి సాధ్యమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో రాజ్‌నాథ్‌సింగ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. రేపటితో తొలి విడత పోలింగ్‌కు ప్రచారం ముగియనుంది. దీంతో ప్రచారాన్ని వేగవంతం చేశారు.

ఇది కూడా చదవండి: Flight: గాల్లో ఉండగా విమానంలో కుదుపులు.. వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు.. వీడియో వైరల్

ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ… ‘‘పశ్చిమ బెంగాల్ ప్రజలు తృణమూల్ కాంగ్రెస్‌కు వరుసగా మూడు అవకాశాలు ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి 15 ఏళ్లు తక్కువ సమయం కాదని నేను భావిస్తున్నాను. దేశంలో కేవలం ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాల కాలంలోనే రాష్ట్రాలను వేగంగా అభివృద్ధి చేసుకున్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు పశ్చిమ బెంగాల్ అందించే వాటా.. గతంలో 10 శాతం ఉండేది. టీఎంసీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 శాతానికి పడిపోయింది. బెంగాల్ ప్రజలు భయం, తీవ్రవాద వాతావరణంలో జీవితాలను గడుపుతున్నారు. ఈసారి మార్పు తప్పక రావాలి. ఇక్కడి తల్లులకు, సోదరీమణులకు నేను భరోసా ఇస్తున్నాను. భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయండి. లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడానికి ప్రధాని మోడీ పూర్తిగా కట్టుబడి ఉన్నారు. ఈ రోజు కాకపోయినా.. రేపైనా సరే అది తప్పక జరుగుతుంది.’’ అని రాజ్‌నాథ్‌సింగ్ భరోసా ఇచ్చారు.

‘‘ఎన్ని సీట్లు గెలుస్తామన్నది నేను కచ్చితంగా అంచనా వేయలేను. కానీ ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను. బీజేపీ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధిస్తుంది. బీజేపీ మూడింట రెండు వంతుల మెజారిటీని గెలుచుకుంటుంది. టీఎంసీ, డీఎంకే, కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ… ఈ పార్టీలన్నీ మహిళా రిజర్వేషన్ వ్యతిరేకించాయి. మహిళలకు రిజర్వేషన్‌ను వ్యతిరేకించిన ఆ రాజకీయ పార్టీలకు మహిళలే తగిన గుణపాఠం నేర్పిస్తారు.’’ అని అన్నారు.

బెంగాల్‌లో రెండు విడతలుగా పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 23 కాగా, రెండో విడత ఏప్రిల్ 29న జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి.