Reading Time: 2 minutes

శబరిమల కేసు: మూఢనమ్మకాలను అరికట్టే హక్కు మాకు ఉందన్న సుప్రీంకోర్టు.. వ్యతిరేకించిన కేంద్రం..

Caption of Image.

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం ఇతర మతపరమైన ఆచారాలపై జరుగుతున్న విచారణలో భాగంగా, సుప్రీంకోర్టు బుధవారం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. మతాల్లో ఉండే మూఢనమ్మకాలను అరికట్టే అధికారం కోర్టులకు ఉందా ? లేదా ? అనే అంశంపై పెద్ద చర్చ జరిగింది.

 కేంద్రం తరఫున వాదించిన తుషార్ మెహతా కోర్టు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ  ఏదైనా ఒక ఆచారం మూఢనమ్మకమా కాదా అని తేల్చడం కోర్టుల పని కాదు. అది కేవలం చట్ట సభలు చేయాల్సిన పని.  న్యాయమూర్తులు చట్టంలో నిపుణులు కానీ, మతపరమైన విషయాల్లో కాదు. ఒకరికి మూఢనమ్మకంగా అనిపించేది మరొకరికి పవిత్రమైన ఆచారం కావచ్చు. మన దేశం చాలా పెద్దది. ఒక ప్రాంతంలో పాటించే ఆచారం మరో ప్రాంతం వారికి వింతగా అనిపించవచ్చు. అందుకే కోర్టులు ఇందులో జోక్యం చేసుకోకూడదు  అని అన్నారు. 

 కేంద్రం వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. న్యాయమూర్తులు ఒక ఆచారం మూఢనమ్మకమా కాదా అని నిర్ధారించే అధికారం కోర్టులకు ఉంది. కేవలం శాసనసభ నిర్ణయం కోసమే వేచి చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా మతంలో మంత్రవిద్యలు లాంటివి ఉంటే, అవి మత ఆచారాలే కదా అని ఊరుకోవాలా ? అవి ప్రజల ఆరోగ్యం, ప్రాణాలకు ముప్పు కలిగిస్తే కోర్టులు కచ్చితంగా జోక్యం చేసుకుంటాయి. ఒకవేళ మతపరమైన ఆచారాల వల్ల ప్రజల హక్కులకు భంగం కలుగుతుంటే, ప్రభుత్వం చట్టం చేసే వరకు కోర్టులు ఖాళీగా కూర్చోలేవని న్యాయమూర్తులు ప్రశ్నించారు. 

ఈ కేసు  ఏంటి అంటే 
2018లో శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు వెళ్లవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2019లో ఈ తీర్పుపై అభ్యంతరాలు రావడంతో, మత స్వేచ్ఛకు సంబంధించిన మరిన్ని లోతైన అంశాలను విచారించడానికి ఈ కేసును 9 మంది సభ్యుల  ధర్మాసనానికి బదిలీ చేశారు. ప్రస్తుతం మహిళలపై వివక్ష, మత స్వేచ్ఛ పరిమితులు వంటి అంశాలపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.

►ALSO READ | డేరింగ్ లేడీ కానిస్టేబుల్.. చంపేస్తామని బెదిరించినా.. నిజం, న్యాయం కోసం నిలబడిన రేవతి: దేశ వ్యాప్తంగా ప్రశంసలు

కేంద్ర ప్రభుత్వం మతపరమైన విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని అంటుంటే, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న మూఢనమ్మకాలను అరికట్టే హక్కు తమకు ఉందని సుప్రీంకోర్టు వాదిస్తోంది. ఈ చర్చల ఫలితం భారతదేశంలోని అనేక మతపరమైన ఆచారాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

©️ VIL Media Pvt Ltd.