
రేణు దేశాయ్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు . నటిగా , సామాజిక కార్యకర్తగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె సోషల్ మీడియాలో జరిగే అన్యాయాలపై ఎప్పుడూ గళం విప్పుతూనే ఉంటారు. లేటెస్ట్ గా, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు చేస్తున్న ట్రోలింగ్ పై రేణు దేశాయ్ మరోసారి నిప్పులు చెరిగారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
కళాకారులు మీ దృష్టిలో ఉగ్రవాదులా?
తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ట్రోలర్లకు రేణు దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కళాకారులు మీ దృష్టిలో నేరస్తులా? లేక ఉగ్రవాదులా? అంత దారుణమైన పదజాలంతో దూషించడానికి వారు చేసిన తప్పేంటి?” అని ఆమె సూటిగా ప్రశ్నించారు. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఇతరులను గౌరవించినప్పుడే అర్థవంతంగా ఉంటుందని, కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో అది కేవలం ‘బూతులు తిట్టే హక్కు’గా మారిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అది స్వేచ్ఛ కాదు, వేధింపు!
సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల పట్ల నెటిజన్లు అమితమైన ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, ఆ ఆసక్తి కాస్తా హద్దులు దాటి విమర్శల స్థాయి నుంచి వ్యక్తిత్వ హననం వరకు వెళ్తోంది. దీనిపై రేణుదేశాయ్ స్పందిస్తూ… ఒక వ్యక్తి చేసే పని లేదా వారి అభిప్రాయం మీకు నచ్చకపోతే, సింపుల్‌గా వారిని అన్‌ఫాలో చేయండి. అంతేకానీ, సభ్య సమాజం తలదించుకునేలా అసభ్య పదజాలంతో దూషించడం ఏ రకమైన సంస్కారం? అని ఆమె ప్రశ్నించారు. మీకు నచ్చని అభిప్రాయం ఎదురైనప్పుడు వెంటనే బూతులు తిట్టడం స్వేచ్ఛ కాదని, అది ముమ్మాటికీ వేధింపే అని ఆమె తేల్చి చెప్పారు.
పరిష్కారం ఎక్కడ?
గతంలో కూడా రేణు దేశాయ్ తన వ్యక్తిగత జీవితం, పిల్లల , సామాజిక అంశాలపై స్పందించినప్పుడు తీవ్రమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. ప్రతిసారీ ఆమె ఎంతో పరిణతితో, ధైర్యంగా సమాధానమిస్తూనే ఉన్నారు. సెలబ్రిటీలకు ప్రైవసీ అనేది లేకుండా పోయిందని, వారిని కేవలం వినోద వస్తువులుగా చూడటం మానేయాలని ఆమె సూచించారు. రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలకు సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. సైబర్ వేధింపులకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు రావాలని, ఆన్‌లైన్ వేదికలపై సంయమనం అవసరమని నెటిజన్లలో మార్పు రావాలని కోరుతున్నారు.