
ఈ రాత్రికే ఇరాన్ నాగరికత మొత్తం అంతమైపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లో ఇరాన్ ఒప్పందం చేసుకోకపోతే సర్వ నాశనం అవుతుందని ట్రంప్ ముందే హెచ్చరించారు. అయితే ఒప్పందం చేసుకునేందుకు ఇరాన్ నిరాకరించింది. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి 14 మిలియన్లకు పైగా ఇరానీయులు సంసిద్ధత ప్రకటించారని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అన్నారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా హెచ్చరికలు జారీ చేశారు. ఈ రాత్రికే ఇరాన్ నాగరికత అంతం అవుతుందని లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధంలో ఈ రాత్రి అత్యంత కీలకమైనదిగా ట్రంప్ పేర్కొన్నారు. ఈ రాత్రి ఒక నాగరికత పూర్తిగా నాశనమవుతుందని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. 47 ఏళ్ల అణచివేత, అవినీతి, మరణాలకు ఎట్టకేలకు ముగింపు పలుకుతామని ట్రంప్ ప్రకటించారు.
‘‘ఈ రాత్రి ఒక నాగరికత మొత్తం అంతమైపోతుంది.. దాన్ని ఇక ఎప్పటికీ పునరుద్ధరించలేరు. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు. కానీ బహుశా అది జరిగి తీరుతుంది.’’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పోస్ట్‌లో రాశారు.
ఇదిలా ఉంటే ట్రంప్ హెచ్చరించినట్లుగానే గడువుకు ముందే ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జ్‌లు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఇరాన్‌లోని ఖర్గ్ ద్వీపంపై అమెరికా క్షిపణి దాడులు చేసింది. అలాగే కరాజ్ నగరంలో విద్యుత్ ప్లాంట్‌పై దాడి చేయగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చమురు కేంద్రమైన ఖార్గ్ ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకుని పలు దాడులు జరిగాయని ఇరాన్‌కు చెందిన మెహర్ న్యూస్ పేర్కొంది.
ఇక ఇరాన్‌లో రైల్వే సర్వీసులు కూడా నిలిచిపోయాయి. ఇరానీయులు రైళ్ల ప్రయాణాలకు దూరంగా ఉండాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అంటే రైళ్లను ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ ముందుగా స్టేషన్లు, రైలు సర్వీసులను నిలిపివేసింది. ఇక రైళ్లను ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకుని దాడులు చేయడంతో ఇద్దరు ఇరానీయులు చనిపోయినట్లు సమాచారం.
ఫిబ్రవరి 28 నుంచి పశ్చిమాసియా యుద్ధం జరుగుతోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. అంతేకాకుండా పలువురు కీలక నేతలు కూడా చనిపోయారు. అప్పటి నుంచి ఇరాన్ కూడా ప్రతీకార దాడులతో చెలరేగిపోయింది. గల్ఫ్ దేశాలు లక్ష్యంగా క్షిపణులు ప్రయోగించింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది.
అయితే హార్ముజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ డెడ్‌లైన్ విధించారు. ఒప్పందం చేసుకోకపోతే 48 గంటల్లో ఇరాన్‌ను సర్వ నాశనం చేస్తామని ట్రంప్ బెదిరించారు. అయితే ఒప్పందం చేసుకునేందుకు ఇరాన్ ససేమిరా అంది. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పందం చేసుకోబోమని తేల్చి చెప్పింది. తాజాగా ఒప్పందం రద్దు కావడంతో డెడ్‌లైన్‌కు ముందుగానే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా భీకర దాడులు చేస్తున్నాయి. దీంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి.
