Reading Time: < 1 minute
Hyderabad Banjara Hills Rotten Biryani Restaurant Busted

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ప్రాంతమైన బంజారాహిల్స్‌లో వెలుగుచూసిన కుళ్లిన బిర్యానీ ఉదంతం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ‘లక్కీ బిర్యానీ షవర్మాస్’ అనే రెస్టారెంట్ బాగోతాన్ని బంజారాహిల్స్ పోలీసులు రట్టు చేశారు. అసలు వివరాల్లోకి వెళ్తే, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ టూలోని వెంకటరమణ కాలనీకి చెందిన కొండారెడ్డి అనే వ్యక్తి ఆదివారం ఉదయం ఒక ఆన్‌లైన్ ఫుడ్ యాప్ ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే, డెలివరీ అయిన ప్యాకెట్ తెరవగానే అందులో నుంచి విపరీతమైన దుర్వాసన రావడమే కాకుండా, బిర్యానీ పూర్తిగా కుళ్లిపోయి ఉండటాన్ని గమనించిన ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

BCCI మాస్టర్ ప్లాన్.. నెక్స్ట్ జెనరేషన్ టెస్ట్ క్రికెటర్లను తీర్చిదిద్ధేందుకు ప్రత్యేక రోడ్ మ్యాప్..!

ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు రెస్టారెంట్‌పై ఆకస్మిక దాడులు నిర్వహించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. జీడిమెట్లలో మూడు రోజుల క్రితమే తయారు చేసిన బిర్యానీని ప్యాకెట్లుగా మార్చి, ఇక్కడి అవుట్‌లెట్ లోని ఫ్రిడ్జ్‌లో భద్రపరుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆన్‌లైన్‌లో ఎవరైనా ఆర్డర్ చేసినప్పుడు, ఆ పాత ప్యాకెట్లను తీసి ఓవెన్‌లో వేడి చేసి కొత్త బిర్యానీలా కస్టమర్లకు పంపిస్తున్నట్లు విచారణలో తేలింది. హోటల్ ప్రాంగణం అంతా అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా, ఆహార పదార్థాలు నిల్వ ఉంచిన ఫ్రిడ్జ్‌లో ఎలుకలు కూడా తిరుగుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు.

UP: పొలాల్లో హఠాత్తుగా దిగిన 3 సైనిక హెలికాపర్టు.. బెంబేలెత్తిపోయిన గ్రామస్తులు

ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ రెస్టారెంట్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన పోలీసులు, హోటల్ యజమాని ఇర్ఫాన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కుళ్లిన ఆహారాన్ని విక్రయిస్తున్న సదరు హోటల్‌ను వెంటనే సీజ్ చేశారు. ఈ ఘటన ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి గుర్తు చేస్తోంది.