
టెహ్రాన్: ఓ వైపు శాంతి చర్చలు అంటూనే అమెరికా బరి తెగించింది. ఇరాన్ గుండె లాంటిదైనా ఖార్గ్ ద్వీపంపై భీకర దాడులతో విరుచుకుపడింది అమెరికా. పబ్లిక్ సెక్టార్లపై దాడులు చేయొద్దని యుద్ధ నిబంధనలు ఉల్లంఘించి మిస్సైళ్లు, బాంబుల వర్షం కురిపించడంతో ఖార్గ్ ద్వీపం అగ్ని గోళంగా మారింది. ఆకాశాన్నంటేలా భారీగా మంటలు చెలరేగాయి. ఖార్గ్ ద్వీపంపై దాడుల్లో అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా పాల్గొంది.
ఖార్గ్ ద్వీపంపై దాడులను ఇరాన్ మీడియా సంస్థ మెహర్ న్యూస్ ధృవీకరించింది. మంగళవారం (ఏప్రిల్ 7) తెల్లవారుజామున ద్వీపంలో భారీ పేలుడు సంభవించినట్లు నివేదించింది. ఈ దాడుల శబ్దాలు ద్వీపం అంతటా వినిపించాయని ఆ సంస్థ పేర్కొంది. ఈ దాడుల్లో ఖార్గ్ ద్వీపంలోని రాడార్ స్టేషన్, డాక్ సౌకర్యాలు, పలు సైనిక స్థావరాలతో సహా కీలకమైన ప్రదేశాలు దెబ్బతిన్నట్లు తెలిపింది.
ఖార్గ్ ద్వీపం ఇరాన్‌కు కీలక చమురు ఎగుమతి కేంద్రం. ఇరాన్ చమురు రవాణా దాదాపు 90 శాతం ఇక్కడి నుంచే జరుగుతోంది. ఖార్గ్ ద్వీపంలో 30 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురును నిల్వ చేసే మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ ఆర్ధిక వ్యవస్థకు ఖార్గ్ ద్వీపం గుండె కాయవంటింది. ఇరాన్ కు ప్రధాన ఆదాయ వనరైన ఖార్గ్ ద్వీపంపై దాడులు చేసి ఆ దేశ ఆర్ధిక మూలాలు దెబ్బ తీయాలనే లక్ష్యంతో అమెరికా, ఇజ్రాయెల్ ఈ దాడులకు ఒడిగట్టాయి.
హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెహ్రాన్‌కు మంగళవారం (ఏప్రిల్ 7) వరకు డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. అలాగే, తాత్కాలిక కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని ఇరాన్‌పై ఒత్తిడి చేశాడు. కానీ తాత్కాలిక సీజ్ ఫైర్‌కు ఇరాన్ ససేమిరా అన్నది. యుద్దం పూర్తిగా ఆగేలా మాత్రమే ఒప్పందం చేసుకుంటామని తమ వైఖరిని స్పష్టం చేసింది. అమెరికా తమ షరతులకు అంగీకరిస్తేనే హార్మూజ్ జల సంధిని తిరిగి తెరుస్తామని.. లేదంటే లేదని ఇరాన్ కరాకండిగా చెప్పింది.
కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ నిరాకరించడంతో ట్రంప్ ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. ఏం చేయాలో దిక్కుతోచక విధించిన డెడ్ లైన్ కన్నా ముందే ఇరాన్‌లోని పబ్లిక్ సెక్టార్లపై అమెరికా దాడులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇరాన్ కీలక చమురు ఎగుమతి కేంద్రమైన ఖార్గ్ ద్వీపంపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులకు తెగబడ్డాయి.
ఖార్గ్ ద్వీపంతో పాటు ఇరాన్‌లోని పలు పవర్ ప్లాంట్లు, ఎత్తైన వంతెనలపైన అమెరికా, ఇజ్రాయెల్ దళాలు మూకుమ్మడిగా అటాక్స్ చేస్తున్నాయి. ఇరాన్ కూడా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. అమెరికాతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. దీంతో పశ్చిమాసియా యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందోనని ప్రపంచ దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.