Reading Time: 2 minutes

మూగబోయిన మైకులు.. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ప్రచారం బంద్

Caption of Image.

న్యూఢిల్లీ: కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది. మంగళవారం (ఏప్రిల్ 7) సాయంత్రం 6 గంటలకు రెండు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మైకులు మూగబోయాయి. దాదాపు నెలరోజులుగా వివిధ పార్టీల ప్రచారంతో హోరెత్తిన ఈ ప్రాంతాల్లో ఎన్నికలకు 48 గంటల ముందే సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. ఈ సమయంలో బహిరంగ సభలు, రోడ్ షోలు, లౌడ్ స్పీకర్లతో ప్రచారం చేయడం, ఓటర్లను ప్రలోభపెట్టడం వంటివి నిషేధం.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. అలాగే, 2026, ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 7 గంటల నుంచి ఏప్రిల్ 29వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‎పై నిషేధం విధించింది ఈసీ. కాగా, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి విషయం తెలిసిందే. 

కేరళలో ట్రయాంగిల్ ఫైట్:

కేరళలో ఈసారి ట్రయాంగిల్ ఫైట్ నెలకొంది. ప్రతిసారి ఈ రాష్ట్రంలో అధికార ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. కానీ ఈసారి బీజేపీ కూడా రేసులోకి వచ్చింది. గత కొంతకాలంగా కేరళలో బీజేపీ పట్టు పెంచుకుంది. కమ్యూనిస్టులకు కంచుకోటైన తిరువనంతపురం మేయర్ మున్సిపాలిటీలో విజయకేతనం ఎగరేసి బీజేపీ సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే ఈసారి కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీల మధ్య ముక్కోణపు పోరు సాగనుంది. మూడు కూటములు నువ్వా నేనా అన్నట్లు తలపడనున్నాయి. 

తమిళనాడులో ఇండియా వర్సెస్ ఎన్డీఏ:

తమిళనాడులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ.. డీఎంకే, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి, విజయ్ టీవీకే పార్టీ హోరా హోరీగా తలపడుతున్నాయి. దక్షిణాదిలో పాగా వేయాలని ఎంతోకాలంగా ఎదురు చూస్తోన్న బీజేపీ ఈసారి తమిళనాడులో అధికారం చేజిక్కించుకుని క్రమంగా సౌత్ లో విస్తరించాలని ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగానే అన్నాడీఎంకేతో చేతులు కలిపి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాషాయ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. 

మరోవైపు డీఎంకే వరుసగా రెండో సారి విజయమే లక్ష్యంగా దూసుకుపోతుంది. తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ఉనికి ప్రమాదంలో పడుతుందంటూ డీఎంకే ప్రచారం హోరెత్తించింది. మరోవైపు, నటుడు విజయ్ టీవీకే పార్టీ కూడా అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఒక్క ఛాన్స్ అంటూ విజయ్ ప్రచారం హోరెత్తిస్తున్నారు. దీంతో ఈ సారి తమిళనాడులో త్రిముఖ పోరు రసవత్తరంగా సాగనుంది. 

 

©️ VIL Media Pvt Ltd.