Reading Time: < 1 minute

జగిత్యాల జిల్లాలో విషాదం.. కుర్రాడిని మింగేసిన జలపాతం.. ఫ్రెండ్స్ కళ్ల ముందే ప్రాణం పోయింది !

Caption of Image.

కోరుట్ల: జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. కర్ణాటక ట్రిప్నకు వెళ్లిన కోరుట్ల యువకుడు జలపాతంలో ఈత కొడుతూ గల్లంతయ్యాడు. అవతలి నుంచి ఇవతలికి రాలేక మధ్యలోనే మునిగిపోయాడు. ఫ్రెండ్స్ కళ్ల ముందే యువకుడి ప్రాణం పోయింది. కోరుట్ల పట్టణంలోని అయ్యప్పగుట్ట ప్రాంతానికి చెందిన అజయ్ గౌడ్ (25) విహారయాత్రకు వెళ్లి కర్ణాటకలోని విభూతి వాటర్ ఫాల్స్లో గల్లంతయ్యాడు. 

పది రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చి.. హైదరాబాద్కు చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి సోమవారం కర్ణాటకకు విహారయాత్రకు వెళ్లిన అజయ్ గౌడ్ ప్రమాదవశాత్తూ జలపాతంలో మునిగి చనిపోయాడు. సరదా కోసం స్నేహితులు వీడియో తీస్తుండగా వాటర్ ఫాల్స్లోకి దిగి ఈత కొట్టిన అజయ్ లోతు ఎక్కువగా ఉండడంతో బయటకు రాలేక మునిగిపోయాడు.

కళ్ళ ముందే స్నేహితుడు మునిగిపోతుండగా స్నేహితులు రక్షించడానికి ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో అజయ్ జలపాతంలో లోతుకు వెళ్లిపోయాడు. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన అజయ్ విహారయాత్రకు వెళ్లి మృతి చెందడంతో కోరుట్లలోని అయ్యప్ప గుట్టలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసి వస్తానని చెప్పి సంతోషంగా వెళ్లిన కొడుకు.. విగత జీవిగా తిరిగొస్తాడని అజయ్ గౌడ్ తల్లిదండ్రులు కలలో కూడా ఊహించలేదు. చేతికి అంది వచ్చిన కొడుకు అకాల మరణాన్ని అజయ్ గౌడ్ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. గుండెలవిసేలా రోదించారు. అజయ్ గౌడ్ ఫ్రెండ్స్, సన్నిహితుల రోదనలతో అయ్యప్ప గుట్ట ప్రాంతం శోక సంద్రాన్ని తలపించింది.

©️ VIL Media Pvt Ltd.