Reading Time: 2 minutes

Sarke Chunar Row: సాకులు చెప్పి తప్పించుకోలేరు.. సమాధానం కావాలి.. బోల్డ్ సాంగ్‌పై మహిళా కమిషన్ ఫైర్

Caption of Image.

కన్నడ యాక్షన్ స్టార్ ధ్రువ సర్జా-దర్శకుడు ప్రేమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం KD: ది డెవిల్ (KD: The Devil). 1970ల కాలం నాటి బెంగళూరు అండర్ వరల్డ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన “సర్కే చునర్ తేరి సర్కే (Sarke Chunar Teri)” స్పెషల్ సాంగ్ దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ పాటలో నోరా ఫతేహి చేసిన డ్యాన్స్, సాహిత్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. లిరిక్స్ అశ్లీలంగా ఉన్నాయని, మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

ప్రస్తుతం ఈ పాట వివాదం తీవ్రరూపం దాల్చడంతో జాతీయ మహిళా కమిషన్ (NCW) రంగంలోకి దిగింది. విచారణలో భాగంగా నోరా ఫతేహి మరియు నటుడు సంజయ్‌దత్‌లకు నోటీసులు జారీ చేసి హాజరు కావాలని ఆదేశించింది.

నోరా ఫతేహికి ఫైనల్ నోటీసు

ఏప్రిల్ 6న జరిగిన విచారణలో నోరా ఫతేహి  హాజరు కాకపోవడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే నోరా ఫతేహి వ్యక్తిగతంగా హాజరు కావడానికి చివరి అవకాశం ఇచ్చింది. తదుపరి విచారణ ఏప్రిల్ 27, 2026 న జరగనుంది. ఏప్రిల్ 6న జరిగిన విచారణలో ఆమె తరఫున న్యాయవాది హాజరయ్యినప్పటికీ, కమిషన్ ఆమె స్వయంగా హాజరు కావాలని స్పష్టం చేసింది.

సంజయ్ దత్ విచారణ ఏప్రిల్ 8న

సంజయ్ దత్‌ను వెంటనే విచారణకు పిలిచిన కమిషన్, ఆయన హాజరు తేదీని ఏప్రిల్ 8 గా నిర్ణయించింది. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్‌ 8న దత్ తప్పకుండా హాజరుకావాలని కోరింది. 

చైర్‌పర్సన్ తీవ్ర అభ్యంతరం

జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయా రహత్కర్ పాటలోని లిరిక్స్‌పై తీవ్రంగా స్పందించారు. ఈ పదాలు మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని, అర్థం తెలియదనే వివరణను అంగీకరించలేమని ఆమె పేర్కొన్నారు.

నిర్మాతల క్షమాపణ

లిరిసిస్ట్ రకీబ్‌ ఆలం, దర్శకుడు ప్రేమ్, అలాగే KVN ప్రొడక్షన్స్ ప్రతినిధులు కమిషన్ ఎదుట హాజరై క్షమాపణలు తెలిపారు. మహిళా సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే లిఖితపూర్వక క్షమాపణలు చెప్పి, పాటను ఇప్పటికే యూట్యూబ్‌ నుంచి తొలగించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన సినిమా పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

ALSO READ : నేను పెళ్లి చేసుకున్నా ..

మహిళా కమిషన్లు, సెలబ్రిటీల ఆగ్రహం

మరోవైపు ఈ పాటపై విమర్శలు అంతకంతకూ పెరుగుతున్నాయి. హర్యానా, కర్ణాటక మహిళా కమిషన్లు ఈ పాటలోని సాహిత్యంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్, గాయకుడు అర్మాన్ మాలిక్, నటుడు రవి కిషన్ వంటి ప్రముఖులు ఈ పాటను “చీప్” గా వర్ణించారు. అశ్లీలతను ప్రోత్సహిస్తున్న ఈ పాటను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

లీగల్ చిక్కులు.. 

ఈ వివాదం కేవలం విమర్శలకే పరిమితం కాలేదు. ఒక న్యాయవాది ఇప్పటికే సెన్సార్ బోర్డును (CBFC) ఆశ్రయించి, ఈ పాటను నిషేధించాలని ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్‌లో కూడా దీనిపై ఫిర్యాదు నమోదైంది. వివాదం ముదరడంతో హిందీ వెర్షన్ పాటను యూట్యూబ్ నుండి తొలగించారు. ఈ మూవీలో ధ్రువ సర్జా, సంజయ్ దత్, శిల్పా శెట్టి, రమేష్ అరవింద్, రవిచంద్రన్ నటించారు. ఏప్రిల్ 30న విడుదల కానుంది. వివాదాల నడుమ రిలీజ్ కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

©️ VIL Media Pvt Ltd.