Reading Time: 2 minutes

వొడాఫోన్ ఐడియాకి బిగ్ రిలీఫ్: ఏజీఆర్ బకాయిల లెక్కింపు గడువు పొడిగింపు

Caption of Image.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన కూరుకుపోయిన టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియాకి కేంద్ర ప్రభుత్వం మరికొంత ఊరటనిచ్చింది. కంపెనీ చెల్లించాల్సిన AGR బకాయిల పునఃపరిశీలన గడువును టెలికాం శాఖ మరో మూడు నెలల పాటు పొడిగించింది. తాజా నిర్ణయంతో జూన్ 30 వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2007 నుంచి 2019 మధ్య కాలానికి సంబంధించిన ఏజీఆర్ బకాయిలను తిరిగి లెక్కించేందుకు కేంద్రం గతంలోనే అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ గడువు పొడిగింపు వల్ల కంపెనీకి తన పాత రికార్డులను సరిచూసుకునేందుకు మరింత సమయం దొరికినట్లయింది.

ఈ బకాయిల లెక్కింపులో లైసెన్స్ ఫీజుల పునఃపరిశీలన ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. అయితే స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల లెక్కింపులో మాత్రం జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా వొడాఫోన్ ఐడియా నుంచి అందాల్సిన పాత డాక్యుమెంట్లు, రికార్డులు అందుబాటులో లేకపోవడంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డేటా పోల్చి చూడటంలో తలెత్తుతున్న సాంకేతిక లోపాలను సరిదిద్ది, కచ్చితమైన బకాయిలను లెక్కించటానికి గడువును పొడిగించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 22 నాటికే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా.. క్లిష్టమైన లెక్కల కారణంగా ఇప్పుడు జూన్ నెలాఖరు వరకు మరింత సమయం అందించబడింది. 

ప్రభుత్వానికి వొడాఫోన్ ఐడియాలో సుమారు 49 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. గతంలో కంపెనీ చెల్లించాల్సిన భారీ బకాయిలను ఈక్విటీగా మార్చడం కారణంగా ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా అవతరించింది. రిపోర్ట్స్ ప్రకారం ఈ పునఃపరిశీలన ప్రక్రియ పూర్తయితే కంపెనీపై ఉన్న ఏజీఆర్ భారం భారీగా తగ్గే అవకాశం ఉంది. డిసెంబర్ చివరి నాటికి వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ బకాయిలు రూ.87వేల 695 కోట్లుగా ఉన్నాయి. ఈ మొత్తాన్ని చెల్లించడానికి ప్రభుత్వం ఇప్పటికే వెసులుబాటు కల్పించింది. 2032 నుండి 2041 ఆర్థిక సంవత్సరాల మధ్య ఈ బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు కంపెనీకి అవకాశం దక్కింది.

ALSO READ : పేటీఎం కొత్త ఫీచర్స్

కొత్త పేమెంట్ షెడ్యూల్స్ ప్రకారం.. వొడాఫోన్ ఐడియా 2026 మార్చి నుండి 2031 మార్చి మధ్య కేవలం రూ.744 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే వార్షికంగా సగటున రూ.124 కోట్ల కంటే ఎక్కువ భారం పడదు. ఆ తర్వాత 2032 నుండి 2035 వరకు ఏటా రూ.100 కోట్లు చెల్లించి, మిగిలిన మొత్తాన్ని 2036 నుండి 2041 మధ్య సమాన వాయిదాల్లో తీర్చవచ్చు. ఈ సుదీర్ఘ గడువుతో పాటు బకాయిల తగ్గింపు అవకాశం వొడాఫోన్ ఐడియా మనుగడకు అత్యంత కీలకంగా మారాయి. ఒకవేళ చెల్లించాల్సిన ఏజీఆర్ భారం తగ్గితే.. కంపెనీ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించి 5G నెట్‌వర్క్ విస్తరణపై దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోందని టెలికాం నిపుణులు అంటున్నారు.

©️ VIL Media Pvt Ltd.