
తెలంగాణ ప్రజల కోసం రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత తెలిపారు. శుక్రవారం ఉదయం తిరుమ ల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురా లు కల్వకుంట్ల కవిత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. అంతకుముందు గురువారం రాత్రి తిరుమల కు చేరుకున్న ఆమె శుక్రవారం ఉదయం తన భర్త అనిల్ తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. కవిత మాట్లాడుతూ సత్యం, న్యాయం , ధర్మం మావైపు ఉందని నేను చెప్తూ వచ్చాను.. స్వామి వారి దయతో కంప్లీట్ గా క్లీన్ చిట్ వచ్చింది.. అందుకే కాలినడకన వచ్చి స్వామివారికి మొక్కు చెల్లించుకున్నాను. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పని చేయడానికి రానున్న రోజుల్లో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాం.. ఆ పార్టీకి స్వామి వారి ఆశీస్సులు, దయ ఉండాలని కోరుకున్నాను. తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని, బాగుండాలని కోరుకున్న.. తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలు, ప్రజలు బాగుండాలని స్వామి వారిని కోరుకున్నాను. అని వెల్లడించారు.