Reading Time: < 1 minute

అమరావతి: మనం తీసుకునే నిర్ణయాలు భావితరాల భవిష్యత్తును నిర్ణచిస్తాయని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజలకు జవాబుదారితనంగా అసెంబ్లీ ఉండాలని అన్నారు. ఎపి అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై సిఎం మాట్లాడారు. ఇబ్బందులు తట్టుకుంటూనే 2014-2019 మధ్య రాష్ట్రాన్ని ముందుకు నడిపామని, 2019-24 మధ్య రాష్ట్రంలో విధ్వంసం చేశారని విమర్శించారు. 2024 లో టిడిపి, జనసేన, బిజెపి కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని, 11 సీట్లు గెలిచిన వారు సభకు రావాలి కదా..! అని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేది తాము కాదు.. ప్రజలు అని.. ప్రజలు ఓటు వేస్తేనే అధికార, ప్రతిపక్ష హోదాలు వస్తాయని తెలియజేశారు. వైసిపి రాజ్యాంగ విలువలు పాటించడం లేదని, రాజ్యాంగ విలువలు పాటించకుండా ఉండే పార్టీలను ఏమనాలి? అని ప్రశ్నించారు.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర పథకాలపై దృష్టి పెట్టామని, కేంద్రం నిధులు వచ్చేలా చర్యలు చేపట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం 93 కేంద్ర పథకాల్లో 85 పథకాలను గాలికి వదిలేసిందని, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిందని మండిపడ్డారు. గత ప్రభుత్వ అప్పులను రీ షెడ్యూల్ చేయించామని, ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాం అని అన్నారు.  గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేస్తామని, పోలవరం ప్రాజెక్టు క్వాలిటీ విషయంలో రాజీ లేదని అన్నారు. కేంద్రం సహకారంతో అమరావతిని ట్రాక్ లో పెట్టామని, ప్రపంచం మెచ్చేలా అమరావతిని నిర్మిస్తున్నామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 

సోషల్ మీడియాతో పిల్లలతో నష్టం జరగకూడదన్నది తమ ఆలోచన అని.. సోషల్ మీడియా బ్యాన్ పై ఎపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 90 రోజుల్లోనే అమలు చేసే దిశగా చర్యలు చేపట్టామని, టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుందని అన్నారు. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేయాలని చంద్రబాబు నాయుడు కోరారు.