Reading Time: < 1 minute

ఎపి ప్రభుత్వం జనాభా సమతుల్యతను కాపాడేందుకు, రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటును అరికట్టి, జనాభా వృద్ధిని ప్రోత్సహించేందుకు సరికొత్త ’జనాభా నిర్వహణ విధానం’ ముసాయిదాను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అసెంబ్లీలో ఆవిష్కరించారు. ఇందులో భాగంగా మూడో బిడ్డను కనే దంపతులకు రూ. 25 వేల ప్రోత్సాహకం అందించాలని ప్రభు త్వం ప్రతిపాదించింది. ముసాయిదా పాలసీ వివరాలను సిఎం చంద్రబాబు వెల్లడిస్తూ మూడో బిడ్డకు ఐదేళ్ల వయసు వచ్చేవరకు నెలకు రూ. 1,000 చొప్పున పౌష్టికాహార సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్యను అందించనున్నట్లు తెలిపారు. పిల్లలు కనేవారిని ప్రోత్సహించేందుకు తల్లికి 12 నెలలు, తండ్రికి 2 నెలల పాటు సెలవులు మంజూరు చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్) 1.5కు పడిపోయిందని, ఇది ఇలాగే కొనసాగితే జపాన్, ఇటలీ మాదిరిగా వృద్ధుల జనాభా పెరిగి,

యువత సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా సమతుల్యత కోసం టిఎఫ్‌ఆర్ రేటును 2.1కి పెంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ (కుటుంబ నియంత్రణ) నినాదం ఉండేదని, ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా ’పాపులేషన్ కేర్’ (జనాభా సంరక్షణ) విధా నానికి మారుతున్నామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను ఇప్పటికే కూటమి ప్రభుత్వం తొలగించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మాతృత్వ, శక్తి, క్షేమ, నైపుణ్యం, సంజీవని అనే ఐదు దశల విధానంతో ప్రజలకు అండగా ఉంటామన్నారు. పిల్లలు లేనివారి కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిపిపి పద్ధతిలో ఐవిఎఫ్ సేవలందిస్తామని వెల్లడించారు. ఈ పాలసీపై నెల రోజులు చర్చించి, మార్చి నెలా ఖరుకు ఖరారు చేసి ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని సిఎం చంద్రబాబు ప్రకటించారు.