
పశ్చిమాసియా యుద్ధభూమిగా భగ్గుమంటోంది. పశ్చిమాసియాలో ఎప్పుడు ఎలాంటి ఉద్రిక్తతలు వచ్చినా వెంటనే అది పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అంతర్జాతీయ చమురు రవాణాకు జీవనాడి వంటి హర్ముజ్ జలసంధిలో నౌకలరవాణాను ఇరాన్ అడ్డుకోవడంతో ధరలు అమాంతంగా పెరిగాయి. సోమవారం (3.3.26) మార్కెట్లు ప్రారంభమైన సమయంలో ఇంటర్ కాంటినెంటల్ ఎక్సేంజీలో బ్రెంట్ క్రూడ్ ఏప్రిల్ కాంట్రాక్ట్ ఒక బ్యారెల్‌కు 10 శాతం పెరిగి 81.87 డాలర్ల గరిష్ఠానికి చేరింది. ఫ్యూచర్స్‌లో బ్రెంట్ క్రూడ్ 13 శాతం పెరిగి 82.37 డాలర్లకు పెరిగింది. తాజాగా సౌదీ అరేబియాలో కీలకమైన ఆరామ్‌కో ఆయిల్ రిఫైనరీపైWest Asia is a burning battlefield. Whenever there is any tension in West Asia, it immediately has a severe impact on the prices of petrol and diesel డ్రోన్లు దాడి చేయడంతో రాస్ తనూరా లోని చమురు శుద్ధి కర్మాగారం మంటల్లో చిక్కుకుంది. తాత్కాలికంగా ఈ రిఫైనరీని మూసివేయడంతో ప్రపంచ ఇంధన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ముడి చమురు ధరలు 9.32 శాతం పెరిగాయి. సౌదీ అరేబియా, యుఎఇ, కువైట్, ఖతార్, ఇరాక్, ఇరాన్ దేశాల నుంచి వివిధ దేశాలకు ఎగుమతి కావలసిన చమురు, ఎల్‌ఎన్‌జి (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్)లకు ఆటంకం ఏర్పడింది. ఈ దేశాల నుంచి రోజుకు 2.1 కోట్ల(21 మిలియన్) బారెళ్ల చమురు ఎగుమతి అవుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ వినియోగంలో ఇది 21 శాతంగా ఉంటోంది. అంతర్జాతీయంగా ఎల్‌ఎన్‌జి వినియోగం లోనూ 20 శాతం ఇక్కడ నుంచే సరఫరా అవుతోంది. మనదేశం దిగుమతి చేసుకునే క్రూడాయిల్‌లో 85 శాతం, అలాగే ఎల్‌ఎన్‌జిలో సగానికి పైగా ఈ హర్మూజ్ జలసంధి మీదుగా రావలసిందే. రోజువారీ 55 లక్షల పీపాల చమురును మనదేశం దిగుమతి చేసుకుంటోంది. ఇది దేశ చమురు అవసరాల్లో 40 శాతానికి సమానం. గత రెండు నెలల్లో ఈ అవసరాలు 50 శాతానికి చేరాయి. ప్రపంచంలో అతిపెద్ద చమురు కొనుగోలుదారుల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. రోజుకు 5.5 మిలియన్ బ్యారెళ్ల మేర చమురును వినియోగిస్తోంది. అందులో 1.52 మిలియన్ల మేర ఈ జలసంధి నుంచే సరఫరా అవుతోంది. ఇప్పటికే రష్యా చమురు కొనుగోలు తగ్గించడంతో పశ్చిమాసియాయే ఇప్పుడు మనకు ప్రత్యామ్నాయంగా మారింది. బ్రెంట్ క్రూడ్ ధర ఒక డాలర్ పెరిగినా, ఒక ఏడాదికి ప్రభుత్వం రూ. 13 వేల కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. గత ఏడాది 160 బిలియన్ డాలర్ల మేర చమురును భారత్ దిగుమతిచేసుకుంది.
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం దీర్ఘకాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. అలాంటప్పుడు మన వద్ద తగినన్ని చమురు నిల్వలు ఉన్నాయా అన్న సందేహం కలుగుతోంది. కెఫ్లర్ గణాంకాల ప్రకారం మనదేశం దగ్గర వాణిజ్య ముడి చమురు నిల్వలు దాదాపు 100 మిలియన్ బ్యారెళ్లు ఉన్నాయి. దీనికి అదనంగా మంగళూరు, పడూర్, విశాఖ పట్టణం ప్రాంతాల్లోని వ్యూహాత్మక నిల్వకేంద్రాల్లో దాదాపు 39 మిలియన్ బ్యారెళ్లు ఉంది. హర్ముజ్ జలసంధి ద్వారా రోజుకు సగటున దిగుమతి అవుతున్న 2.5 మిలియన్ బ్యారెళ్ల చమురు, మన దేశం మొత్తం దిగుమతుల్లో 50 శాతానికి సమానం. ఈ సరఫరా నిలిచిపోయినా, మన వద్ద ఉన్న నిల్వలు దాదాపు 60 రోజుల దిగుమతులకు సరిపోతాయి. భౌగోళిక, రాజకీయ సంక్షోభం ఎదురైనప్పుడు ఇంధన అవసరాలను తీర్చడానికి దేశం లోని వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు 74 రోజుల పాటు సరిపోతాయని గతంలో కేంద్రం ప్రకటించింది. ఇరాన్ రోజుకు 3.2 మిలియన్ బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తుంది. ఏ సంక్షోభం ఎదురైనా ఇరాన్‌లో చమురు ఉత్పత్తి దెబ్బతింటుంది.
చమురు దిగుమతులపై పూర్తిగా ఆధారపడే మనదేశానికి ఇది అతిపెద్ద ముప్పుగా పరిణమించనుంది. దిగుమతి బిల్లులు పెరిగితే దేశీయంగా ఇంధన ధరలు పెరిగి, రవాణా భారం మరింత ఎక్కువై నిత్యావసరాల ధరలు భగ్గుమంటాయి. ఫలితంగా దేశంలో ద్రవ్యోల్బణం తీవ్రస్థాయికి చేరుకుంటుంది. యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన డాలర్ వైపు మొగ్గు చూపుతారు. ఫలితంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కనిష్ఠానికి చేరుకోవచ్చు. చమురు దిగుమతుల కోసం ఎక్కువ డాలర్లను వెచ్చించాల్సి రావడంవల్ల కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతుంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడం వల్ల భారత మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే ప్రమాదం ఉంది. ఇంధనం అవసరాలు చాలావరకు రెండు సముద్ర మార్గాల మీదుగా నౌకలద్వారా భారత్‌కు చేరుకుంటాయి.
ఈ సముద్ర మార్గాల్లో ఒకటి హర్ముజ్ జలసంధి కాగా, రెండవది ఎర్ర సముద్రం (రెడ్‌సీ). చైనా, అమెరికా మాదిరిగా భారత్‌కు రవాణా పైపులైన్లు లేవు. గాజాపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా యెమెన్ కేంద్రంగా ఉన్న హోతీ రెబల్స్ దాడులు చేసినప్పుడు ఎర్ర సముద్ర నౌకా రవాణా మార్గం తీవ్ర ఒత్తిడులను ఎదుర్కొన్న పరిస్థితి మనకు తెలిసిందే. ఇప్పుడు హర్ముజ్ జలసంధి కూడా తీవ్ర అలజడులకు గురవ్వడమే కాక పూర్తిగా మూసివేయడం పశ్చిమాసియాకే చాలా ప్రమాదకరం. తీరని సంఘర్షణలతో సంక్లిష్ట పరిస్థితితో పశ్చిమాసియా సతమతమవుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించినప్పుడు కూడా భారత్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పలేదు. ఇంధనం, ఎరువుల సరఫరాకు ఆటంకాలు ఎదురయ్యాయి. నేచురల్ గ్యాస్ దిగుమతి కోసం రష్యా, ఇరాన్ వంటి దేశాలపై భారత్ ఆధారపడవలసి వస్తోంది. భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన సమయం సమీపించింది.