Reading Time: 2 minutes

మార్చి 8 నుండి మహిళల హాకీ వరల్డ్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్

ఈ మెగా ఈవెంట్‌కు వేదిక కానున్న గచ్చిబౌలి హాకీ స్టేడియం

మన తెలంగాణ/హైదరాబాద్: క్రీడా రంగంలో దేశంలోనే అత్యంత చురుకైన నగరంగా పేరొందిన హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా వేడుకకు వేదిక కానుంది. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ద హాకీ (ఎఫ్‌ఐహెచ్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దూరదృష్టి నాయకత్వంలో క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్‌ను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించబడింది. ఈ పోటీలు ఈ నెల 8 నుండి 14 వరకు హైదరాబాద్‌లో నూతనంగా పునర్నిర్మించబడిన గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జరుగనున్నాయి.

క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌లో పాల్గొననున్న 8 దేశాల జట్లు

ఈ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌లో మొత్తం ఎనిమిది దేశాల జట్లు పాల్గొంటున్నాయి. భారత్, ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లు పాల్గొంటున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ టోర్నమెంట్ 2026 మహిళల హాకీ వరల్ కప్‌కు అర్హత సాధించేందుకు కీలకమవుతుంది. కాగా ఈ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ కోసం ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పించింది. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎటువంటి లోపాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాల ఆస్ట్రో టర్ఫ్, అత్యున్నత భద్రతా ఏర్పాట్లు, క్రీడాకారులు, అధికారుల కోసం ప్రీమియం వసతి అందుబాటులో ఉంచారు. అలాగే హాకీ ఇండియా, (ఎఫ్‌ఐహెచ్) ప్రతినిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలోని పలు శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

హైదరాబాద్ చేరుకున్న జట్లు

భారత జట్టు, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఉరుగ్వే జట్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాయి. అన్ని జట్లకు అంతర్జాతీయ ప్రమాణాల వసతి, ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పించబడ్డాయి. ఈ టోర్నమెంట్ సందర్భంగా నగరానికి విచ్చేసే క్రీడాకారులు, అంతర్జాతీయ ప్రతినిధుల కోసం ప్రత్యేక వారసత్వ పర్యటనలు, వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత వల్ల తెలంగాణలో అనేక జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు విజయవంతంగా జరుగుతున్నాయి. మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 నిర్వహణతో హైదరాబాద్ మరోసారి ప్రపంచ క్రీడా పటంలో తన స్థానాన్ని మరింత బలపరుచుకోనుంది. ఈ సందర్భంగా అన్ని జట్లు, అధికారులు, అభిమానులను తెలంగాణ ప్రభుత్వం హృదయపూర్వకంగా స్వాగతిస్తోంది.