
అన్ని ఆవాసాలకు ఇబ్బంది లేకుండా సరఫరా
ప్రణాళిక రూపకల్పన చేసిన ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం కసరత్తు చేస్తోంది. మిషన్ భగీరథ ద్వారా అన్ని మారు మూల ప్రాంతాలకు తాగునీటిని అందించి నీటి ఎద్దడి లేకుండా చూసేందుకు ప్రణాళికను అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 24 వేల ఆవాసాలు ఉండగా, వాటిలో కేవలం 150 ఆవాసాలకు మాత్రమే మిషన్ భగీరథ నీరు అందడం లేదు. దీనికితోడు కొత్తగా 397 ఆవాసాలు ఏర్పాటైనట్లు నమోదు కావడంతో వీటికి కూడా మిషన్ భగీరథ నీటిని అందించాల్సి ఉంది. కొండలపై, అటవీ ప్రాంతాల్లో పైపు లైన్లు వేయడం సవాల్‌గా ఉన్న ప్రాంతాల్లో స్థానిక జల వనరులను వినియోగించి ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నిరంతర తాగునీటి సరఫరా కల్పించేందుకు గ్రామీణ రక్షిత నీటి సరఫరా విభాగం కృషి చేస్తోంది. మిషన్ భగీరథ పథకానికి నీటిని సరఫరా చేసే రిజర్వాయర్లలో ప్రస్తుతం అవసరాలకు సరిపడా నీరు నిల్వ ఉందని అధికారులు నివేదిక తయారు చేశారు.
దీంతో వేసవిలోనూ పెద్దగా ఇబ్బందులు లేకుండా తాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మిషన్ భగీరథలో చాలా ప్రాంతాల్లో తాగునీరు అందండం లేదనే ఫిర్యాదులపై నిశిత పరిశీలన చేసేందుకు, అందుకు వీలుగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. ఇంటింటికి తాగునీరు అందుతున్న పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకుని, ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాల్సి ఉంది. మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి, ప్రజల్లో మిషన్ భగీరథ నీటిపై నమ్మకం పెంచేలా చూడాలని అధికారులు ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు, సిబ్బంది స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గ్రామసభల్లో మిషన్ భగీరథ నీటి వినియోగంపై తీర్మానాలు చేయించి అవగాహన పెంచేందుకు కూడా నిర్ణయించారు.
ప్రతి కుటుంబానికి తాగునీటిని అందించే ప్రణాళిక
మిషన్ భగీరథ పథకం నిర్దేశించిన మేరకు ప్రతి కుటుంబానికి తాగునీటిని అందించేందుకు వీలుగా ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. గ్రామీణ ప్రాంతంలో అయితే రోజుకు తలసరి వంద లీటర్లు, అదే మున్సిపాలిటీల్లో అయితే తలసరి 135 లీటర్లు, నగర పాలక సంస్థల్లో అయితే తలసరి 150 లీటర్లు సరఫరా చేయాల్సి ఉంది. గతంలో వర్షాభావం వల్ల నీటి నిల్వలు సరిపడా లేకపోవడం వల్ల అవసరమైన మేర నీటిని సరఫరా చేయలేదు. ఈసారి భారీ వర్షాల కారణంగా నీటి నిల్వలు ఉన్నందున సరఫరా అనుకున్న మేర జరుగుతుందని అధికార వర్గాల సమాచారం. కొత్తగా గుర్తించిన ఆవాసాలకు కూడా తాగునీటిని అందించేందుకు ప్రణాళిక బద్దంగా రూపకల్పన జరుగుతోంది. ఇదిలావుండగా మిషన్ భగీరథ పథకం రాష్ట్రంలో 1.11 లక్షల చదరపు కిలోమీటర్ల మేర నీటి అవసరాలను తీర్చాల్సి ఉంది. 95 నియోజకవర్గాల్లో 2.72 కోట్ల మంది ప్రజలకు తాగునీటిని ఇవ్వాలన్నది మిషన్ భగీరథ లక్షం. ఈ మేరకు పూర్తి లక్షంతో తాగునీటిని అందించేందుకు ప్రణాళిక రచిస్తోంది.
కృష్ణా బేసిన్ నుంచి 32.43 టిఎంసిలు, గోదావరి బేసిన్ నుంచి 53.68 టిఎంసిల నీటిని వినియోగించుకునేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ రూపకల్పన చేసింది. మిషన్ భగీరథలో కొన్ని చోట్ల పైప్‌లైన్ పనులు జరగాల్సి ఉండగా, మరికొన్ని చోట్ల వేసిన వాటికి నష్టం జరగడంతో తిరిగి వేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీంతో 1.50 లక్షల పైప్ లైన్ నెట్ వర్కు ద్వారా నీటిని అందించాల్సి ఉంది. ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే మిషన్ భగీరథ లక్ష్యంగా వేసవి దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. సర్పంచ్‌లతో సమన్వయం చేసుకుని గ్రామాల వారీగా సరఫరా పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈసారి సర్పంచ్‌లను ఎక్కువగా దీనిలో భాగస్వాములను చేసి మిషన్ భగీరథలో ఇబ్బందులు లేకుండా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. గ్రామాల వారీగా తాగునీటి అవసరాలు, సరఫరా పరిస్థితులపై సర్పంచ్‌లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది.