
మేడ్చల్ జిల్లా: ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఏదులాబాద్‌లో సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. బుధవారం ఉదయం బ్యాంక్ తెరిచిన సిబ్బంది కిటికీ పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు.అలాగే బ్యాంకులోని స్ట్రాంగ్‌రూమ్ సమీపంలోని వెనుక గోడకు రంధ్రం చేసినట్లు గుర్తించారు. దుండగులు బ్యాంకులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినప్పటికీ స్ట్రాంగ్‌రూమ్‌లోకి మాత్రం చొరబడలేకపోయారు.
దీంతో బ్యాంకులోని నగదు, విలువైన వస్తువులు, కీలక పత్రాలు ఏవీ చోరీ కాలేదు. ఘటనపై బ్యాంక్ మేనేజర్ రంజిత్ ఘట్‌కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమాచారం అందుకున్న క్లూస్ టీం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు.బ్యాంకు పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. చోరీకి యత్నించిన దుండగులను గుర్తించేందుకు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు.