Reading Time: < 1 minute
Janhvi Kapoor Reacts Ai Morphing Deepfake Videos Thanks Jr Ntr Chiranjeevi

మహిళల గౌరవానికి భంగం కలిగించేలా సాగుతున్న ఏఐ మార్ఫింగ్ వీడియోల వివాదంపై సినీ నటి జాన్వీ కపూర్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకున్న లేఖ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, శరీర హక్కులు, డిజిటల్ భద్రతపై ఆమె ప్రశ్నలు సంధించారు. మహిళల అనుమతి లేకుండా కల్పిత కంటెంట్‌ను ప్రచారం చేయడం నేరపూరిత ధోరణి మాత్రమే కాదు, అది లైంగిక దాడితో సమానమైన చర్య. చిత్ర పరిశ్రమలోని దాదాపు ప్రతి మహిళ ఏదో ఒక సందర్భంలో ఈ రకమైన వేధింపులను ఎదుర్కొంది. మహిళ ఐదు రోజులు వరుసగా ‘సరే’ అని చెప్పి, ఆరో రోజు ‘వద్దు’ అని చెబితే, ఆ తిరస్కరణను కచ్చితంగా గౌరవించాల్సిందేనని జాన్వీ స్పష్టం చేశారు. మహిళ ఏ దుస్తులు వేసుకున్నా, ఏ కోణంలో కెమెరా పెట్టి అసభ్యంగా చిత్రీకరించే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు. సమాజంలో మహిళల భద్రత కోసం కేవలం “కూతుళ్లను కాపాడుకోండి” అని చెప్పడం పరిష్కారం కాదని ఆమె విమర్శించారు. ఇతరుల హద్దులను ఉల్లంఘించే హక్కు తమకు ఉందనే భావజాలాన్ని సమాజం నుంచి సమూలంగా తుడిచిపెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

తాను ఎదుర్కొన్న ఏఐ వీడియోలు ఒక భాగం మాత్రమేనని, మహిళగా నిత్యం ఎదురయ్యే తీర్పులు, చూపులు, శారీరక భయాలు ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి మరింత విస్తరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్యాయంపై గళమెత్తి, అండగా నిలిచినందుకు జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ సమస్యపై స్పందించి, తప్పును తప్పని ఎత్తిచూపిన మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ, ఖుష్బూలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళను ఒక మనిషిగా గుర్తించి గౌరవించడం చాలా పెద్ద కోరికేమీ కాదని చెబుతూ, “ఆమె శరీరం, ఆమె ప్రతిష్ట, ఆమె సరిహద్దులు, ఆమె ఎంపిక” అనే నినాదంతో ఆమె తన స్పందనను ముగించారు.