Reading Time: 2 minutes
మీ చుట్టూ వాతావరణం ఇలా ఉంటే అక్కడ పులి ఉన్నట్లే.. మీకు తెలియని సీక్రెట్స్ ఇవే..

దట్టమైన అడవిలో సఫారీ జీపు నెమ్మదిగా కదులుతుంటుంది.. చుట్టూ ఏదో తెలియని నిశ్శబ్దం.. అంతలోనే పొదల మాటు నుంచి గంభీరంగా నడుచుకుంటూ అడవికి రారాజైన పులి మీ కళ్ల ముందుకు వస్తే..? ఆ అనుభూతిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేం. వైల్డ్‌లైఫ్ సఫారీకి వెళ్లే ప్రతి ఒక్కరి కల కూడా ఇదే. అయితే చాలామంది సఫారీలో పులి కనిపించడాన్ని కేవలం అదృష్టం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అడవి ఇచ్చే రహస్య సంకేతాలను అర్థం చేసుకుంటే పులి ఎక్కడుందో ఇట్టే పసిగట్టవచ్చని అనుభవజ్ఞులైన వైల్డ్‌లైఫ్ నిపుణులు చెబుతున్నారు. రాజస్థాన్‌లోని రణథంబోర్, సరిస్కా టైగర్ రిజర్వ్‌ల నుంచి ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ వరకు పర్యాటకుల సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో అడవిలో పులి కదలికలను గైడ్లు, ప్రకృతి ప్రేమికులు ఎలా పసిగడతారో తెలిపే కీలక సూత్రాలు వెలుగులోకి వచ్చాయి.

అడవిలో వినిపించే అలెర్ట్ సౌండ్స్

అడవిలో ఏ జీవీ ఒంటరిగా బతకదు. చెట్లు, పక్షులు, కీటకాలు, సాధు జంతువులన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. ప్రముఖ కెనైన్ బిహేవియరలిస్ట్, వైల్డ్‌లైఫ్ నిపుణురాలు స్వాతి టాండన్ తెలిపిన వివరాల ప్రకారం.. పులి సంచరిస్తున్నప్పుడు అడవిలోని జంతువుల ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. చెట్ల కొమ్మలపై ఉండే కోతులు నేలపై పులి కదలికను మొదటగా చూస్తాయి. అవి ప్రమాదాన్ని పసిగట్టి పెద్దగా అరుస్తూ మిగతా జంతువులను హెచ్చరిస్తాయి. ఆ తర్వాత జింకలు గాల్లోకి తలలెత్తి ప్రత్యేకమైన హెచ్చరిక శబ్దాలు చేస్తాయి. పక్షులు, నెమళ్లు, ఉడుతలు సైతం వేటాడే జంతువు రాకను పసిగట్టి భయంతో అరుస్తాయి. కాబట్టి సఫారీలో కళ్లతో పాటు చెవులను అప్రమత్తంగా ఉంచడం ఎంతో ముఖ్యం.

జింక అరుపు.. అత్యంత ప్రత్యేకం

పులి జాడను గుర్తించడంలో జింకల అరుపులకు ప్రత్యేక స్థానముందని పగ్దుండీ సఫారీస్ డైరెక్టర్ మానవ్ ఖండుజా తెలిపారు. సాంబార్ జింక గట్టిగా, నిరంతరాయంగా అరుస్తూ కాళ్లతో నేలను బాదుతున్నట్లు ఉంటే.. సమీపంలోనే పులి నక్కి ఉందని అర్థం చేసుకోవచ్చు. అనుభవజ్ఞులైన నేచురలిస్టులు ఆ అరుపు ఏ దిశ నుంచి వస్తోంది? అది ఒకే చోట ఆగి అరుస్తోందా లేదా పరిగెడుతూ అరుస్తోందా అనే దాన్ని బట్టి పులి అక్కడే నిలబడి ఉందా లేక కదులుతోందా అని అంచనా వేస్తారు.

తాజా పాదముద్రలు

మట్టి రోడ్లపై లేదా అటవీ దారుల్లో కనిపించే పాదముద్రలు పులి రాకను స్పష్టంగా సూచిస్తాయి. పగ్మార్క్స్ ఎంత తాజాగా ఉన్నాయి? ఆ మట్టి ఇంకా తడిగా ఉందా? లేదా దుమ్ము కొట్టుకుపోయిందా? అనే అంశాలను బట్టి పులి ఆ దారిలో వెళ్లి ఎన్ని నిమిషాలు అయ్యిందో లెక్కిస్తారు. సమీపంలో ఉన్న నీటి వనరుల దిశగా ఆ పాదముద్రలు వెళ్తున్నాయా అనే దాన్ని బట్టి జీపును ఎటువైపు తీసుకెళ్లాలో నిర్ణయిస్తారు.

నీటి తొట్టెలు, చెరువుల వద్ద నిఘా

ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఉదయం వేళల్లో పులులు నీటి వనరుల వద్దకు రావడం సహజం. అయితే నీళ్ల దగ్గరకు వెళ్లగానే పులి దర్శనమిస్తుందని గ్యారెంటీ ఉండదు. పులి నీటిలో సేదతీరి పొదల్లోకి వెళ్లిపోవచ్చు. అందుకే నీటి చుట్టుపక్కల ఉండే పక్షుల ప్రవర్తన, జింకల కదలికలను కూడా నిశితంగా గమనించాల్సి ఉంటుంది.

పులి కనపడాలంటే ఓపిక అతిపెద్ద ఆయుధం..

ఒక ప్రాంతంలో పులి ఉన్నట్లు ఆధారాలు దొరికిన వెంటనే జీపును వేగంగా అటువైపు తీసుకెళ్లడం పెద్ద తప్పిదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాహనం ఇంజిన్ శబ్దం, వేగం చూసి పులి మరింత లోపలికి వెళ్లి దాక్కునే ప్రమాదం ఉంది. అనుభవజ్ఞులైన గైడ్లు ఆ సిగ్నల్స్ అందిన ప్రదేశానికి కాస్త దూరంగా జీపు ఆపి, సైలెంట్‌గా వేచి చూస్తారు. కొన్నిసార్లు మనం పులిని చూడకపోవచ్చు.. కానీ పొదల మాటున నక్కిన పులి మనల్ని ఎప్పటి నుంచో చూస్తూనే ఉండొచ్చు.

కేవలం పులిని చూడటం మాత్రమే సఫారీ లక్ష్యం కాకూడదని అడవి నిశబ్దాన్ని, ఆ ప్రకృతి శబ్దాలను, పక్షుల కిలకిలారావాలను ఆస్వాదించడమే అసలైన సఫారీ అనుభూతి అని నిపుణులు సూచిస్తున్నారు.