
ఆర్ధిక అవసరాల కోసం చాలామంది ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్లోని డబ్బులను విత్ డ్రా చేసుకుంటూ ఉంటారు. వివిధ కారణాలు చూపించి పీఎఫ్ ఖాతాలోని నిల్వలను సులువుగా ఆన్‌లైన్ ద్వారా ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇందుకోసం పీఎఫ్ పోర్టల్‌లోకి వెళ్లి క్లెయిమ్ సమర్పించాల్సి ఉంటుంది. అధికారుల పరిశీలన అనంతరం క్లెయిమ్‌కు ఆమోదం తెలిపితే డబ్బులు రెండు, మూడు రోజుల్లో మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి. ఇటీవల ఆటోమేటిక్ విధానం అమల్లోకి తీసుకురావడంతో అత్యంత వేగంగా డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి. అయితే కొన్నిసార్లు చిన్న పొరపాట్ల వల్ల పీఎఫ్ క్లెయిమ్ తిరస్కరించే అవకాశముంది. ఏయే కారణాలు అనేది చూద్దాం.
క్లెయిమ్ ఎప్పుడు రిజెక్ట్ అవుతుంది..?
యూఏఎన్, ఆధార్ వివరాలు సరిపోలకపోవడం వల్ల పీఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. పీఎఫ్ అకౌంట్లోని మీ వివరాలు, ఆధార్ కార్డులోని వివరాలు ఒకేలా ఉండాలి. పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇతర ముఖ్యమైన సమాచారం ఒకేలా ఉండాలి. స్పెల్లింగ్ లేదా డేట్ ఆఫ్ బర్త్‌లో చిన్న తేడా ఉంటే క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశముంది. ఇక పీఎఫ్ రికార్డుల్లో నమోదైన మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు కరెక్ట్‌గా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, ఖాతాదారుడి పేరు సరిగ్గా ఉండాలి. చిన్న పొరపాట్లు ఉంటే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. దీంతో పీఎఫ్ మనీ విత్ డ్రా కోసం అప్లై చేసేటప్పుడు మీ వివరాలు సరి చూసుకోండి. బ్యాంక్ అకౌంట్ మూతపడ్డా లేదా ఇనాక్టివ్ అయినా నిధులు బదిలీ అవ్వవు. దీంతో పీఎఫ్ రికార్డుల్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా ఉందో.. లేదో చూడండి.
కేవేైసీ వివరాలు చెక్ చేస్కోండి..
ఇక కేవైసీ వివరాలు ధృవీకరించబడి ఉన్నాయో.. లేదో చూడండి. ఆధార్, బ్యాంక్ అకౌంట్, పాన్ వంటి కేవైసీ వివరాలు ధృవీకరించి ఉండాలి. ఈ వివరాల్లో ఏదైనా లోపించినా క్లెయిమ్ ప్రాసెస్ ఆలస్యమయ్యే అవకాశముంది. దీంతో క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసేముందు ఒకసారి కేవైసీ స్టేటస్ చెక్ చేస్కోండి. ఇక ఈపీఎఫ్ఓ రికార్డులు, ఆధార్, బ్యాంక్ అకౌంట్లలో పేరు, డేట్ ఆఫ్ బర్త్ భిన్నంగా ఉంటే క్లెయిమ్ ప్రాసెస్ అవ్వదు. దీంతో అన్నింటిల్లోనూ ఒకేలా ఉండేలా చూసుకోండి. ఇక కంపెనీ డేట్ ఆఫ్ ఎంట్రీ, డేట్ ఆఫ్ ఎగ్జిట్ తేదీని తప్పుగా నమోదు చేసినా క్లెయిమ్స్ ప్రభావితం అవుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగి తమ యాజమాన్యాన్ని సంప్రదించి రికార్డులను సరిచేసుకోవాలి. ఈ తప్పులు చేేయకుండా ఉంటే మీ క్లెయిమ్ వెంటనే క్లియర్ అవుతుంది.