Reading Time: < 1 minute

తెలంగాణ అసెంబ్లీ పని దినాలు ఫిక్స్.. సభ ఎన్ని రోజులు నడవనుందంటే..?

Caption of Image.

హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం (సెప్టెంబర్ 7) అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) మీటింగ్‏లో నిర్ణయించారు. సమావేశాలు పొడిగించాలనుకుంటే బీఏసీ మరోసారి భేటీ కానుంది.  ఫీజు రీయింబర్స్‌మెంట్‌, 22A నిషేధిత జాబితాతో పాటు 25 అంశాలపై చర్చ చేపట్టాలని బీఏసీ సమావేశంలో బీజేపీ పట్టుబట్టింది. అయితే, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, 22A నిషేధిత జాబితాపై సభలో చర్చకు సిద్ధమని ప్రభుత్వం తెలిపింది. 

సోమవారం (సెప్టెంబర్ 7) తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బ్లాక్ కలర్ టీషర్ట్‏లతో అసెంబ్లీకి వచ్చారు. దీంతో పోలీసులు వారిని అసెంబ్లీ గేట్ దగ్గర అడుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్‏కు తరలించారు. అసెంబ్లీ గేట్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.

 రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న స్పీకర్‎ను వ్యక్తిగతంగా దూషించాడు. స్పీకర్‎పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారం రేపాయి. తాతా మధు వ్యాఖ్యలను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, ఎంఐఎం సభ్యులు తీవ్రంగా ఖండించారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. తాతా మధు వ్యాఖ్యలకు మనస్థాపానికి గురైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభలోనే కంటతడి పెట్టుకున్నారు. 

©️ VIL Media Pvt Ltd.