
బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సందడి మొదలైంది. సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా ప్రారంభమైన ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’లోకి 16 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా.. కింగ్ నాగార్జున తనదైన స్టైల్‌లో షోను మరింత రసవత్తరంగా మార్చారు. అయితే లేటెస్ట్ గా హౌస్‌లోకి వచ్చిన ఓ జంట మాత్రం అసలు కంటెస్టెంట్లనే కాసేపు పక్కకు నెట్టేసింది. వాళ్లే ‘గుండె నిండా గుడి గంటలు’ ఫేమ్ బాలు– మీనా. ఈ జోడీ ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్‌లో ప్రత్యక్షమై అందరినీ కన్ఫ్యూజన్‌లో పడేసింది.
బాలు పాత్రలో విష్ణుకాంత్, మీనా పాత్రలో అమూల్య గౌడ చేసిన ఓ ప్రమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాలు కళ్లు మూసుకుని ఉండగా మీనా అతడిని బలవంతంగా బిగ్ బాస్ హౌస్‌లోకి లాక్కెళ్లడం.. అక్కడ మొదలైన హోమ్ టూర్ నవ్వులు పూయిస్తోంది. ఇద్దరూ సీరియల్ స్టైల్‌లో ఇంటిని చుట్టేయడం ఆసక్తికరంగా మారింది.
‘మనం మేడపై చిన్న గది కట్టుకోవాలని అనుకుంటున్నాం కదా.. ఇదే దానికి మోడల్ హౌస్’ అంటూ మీనా హౌస్‌లోని ప్రతీ మూలను తన ఇంటిలా ఊహించుకుంటుంది. కిచెన్, హాల్, బెడ్‌రూమ్, అద్దాలు, స్విమ్మింగ్ పూల్.. అన్నింటినీ చూసి తనకు ఎలా కావాలో చెబుతుంటే బాలు మాత్రం పంచ్‌లతో కౌంటర్లు ఇస్తూ చెలరేగిపోతాడు.
కానీ అసలు ట్విస్ట్ ఆ తర్వాతే.. మొదలవుతుంది. ‘ఇది మన ఇల్లు కాదు.. బిగ్ బాస్ హౌస్’ అంటూ బాలు బాంబ్ పేలుస్తాడు. ‘నీకు కిచెన్‌లో వంట కనిపిస్తుంది.. నాకు మనుషుల మధ్య మంట కనిపిస్తుంది. నీకు సోఫా కనిపిస్తుంది.. నాకు గొడవలు కనిపిస్తాయి. నీకు ఆట కనిపిస్తుంది.. నాకు వేట కనిపిస్తుంది’ అంటూ బిగ్ బాస్ అసలు గేమ్ ఏంటో చెప్పేస్తాడు. స్ట్రాటజీలు, మైండ్ గేమ్స్, నామినేషన్లు, ఎలిమినేషన్లు, కుట్రలు, కుతంత్రాలు వింటూనే మీనా షాక్‌కు గురవుతుంది. చివరకు ఇద్దరూ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవడంతో క్లారిటీ వచ్చేస్తుంది.
బాలు– మీనా పర్మినెంట్ కంటెస్టెంట్లు కాదు.. ఇది కేవలం బిగ్ బాస్ 10 ప్రమోషన్‌లో భాగంగానే హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే అమూల్య గౌడకు గతంలో కన్నడ బిగ్ బాస్ లో పాల్గొన్న అనుభవం ఉండటం, ఈ జోడీకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో.. భవిష్యత్తులో వీరిద్దరూ నిజంగానే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారా? అనే ప్రశ్న ఇప్పుడు ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతోంది.