Reading Time: 2 minutes
తీవ్ర విషాదంగా ఇరాన్‌ యువకుడి కథ.. ఉరిశిక్షకు ముందు ఫోన్‌లో వివాహం

జనవరి 8న ఇస్ఫహాన్‌లోని అలీఖానీ స్క్వేర్‌లో జరిగిన నిరసనల్లో నలుగురు పోలీసులు చనిపోయిన ఘటనకు సంబంధించి అలీరెజాపై కేసు నమోదైంది. ఆయుధాల తయారీ సంస్థలో సభ్యత్వం, జాతీయ భద్రతకు ముప్పు కలిగించడం వంటి ఆరోపణలపై మరణశిక్ష విధించింది ఇరాన్ న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ సంస్థ. అయితే విచారణలో న్యాయపరమైన లోపాలు ఉన్నాయని, ఘటన జరిగిన సమయంలో అలీరెజా అక్కడ లేడని చూపించే ఆధారాలను పట్టించుకోలేదని అమెరికాకు చెందిన అబ్దొరహ్మాన్ బోరూమండ్ అనే మానవ హక్కుల సంస్థ ఆరోపించింది. నిరసనల నేపథ్యంలో అలీరెజా సెపాహీని జనవరి 10న అరెస్ట్ చేశారు. అదే కేసులో అతని తల్లిని కూడా అరెస్ట్ చేశారు. ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా ఆమె ప్రస్తుతం జైలులో ఉన్నారు.

ఉరిశిక్షకు ముందు గుండెపోటు

అలీరెజాను ముందుగా జూలై 28న బహిరంగంగా ఉరితీయాలని నిర్ణయించారు. అతడితో పాటు మరో ఇద్దరికి కూడా ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. వారిలో అలీరెజా బంధువు అబోల్ఫజ్ కూడా ఉన్నాడు. అయితే ఉరిశిక్ష అమలుకు కొద్దిసేపటి ముందు అలీరెజాకు గుండెపోటు వచ్చింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజుల తర్వాత కోలుకుని తిరిగి జైలుకు వెళ్లాడు. అయితే ఉరిశిక్ష రద్దు కాలేదు. అప్పటి నుంచి ప్రతి రోజు తనకు మరణశిక్ష ఎప్పుడు అమలవుతుందోనన్న భయంతోనే జైలులో గడిపినట్లు ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి మై సాటో తెలిపారు.

ఉరిశిక్షకు ముందు పెళ్లి

తన అప్పీల్‌ను ఇస్ఫహాన్ రివల్యూషనరీ కోర్టు తిరస్కరించడంతో అలీరెజాకు చివరి అవకాశం కూడా లేకుండా పోయింది. కుటుంబ సభ్యులను చివరిసారి కలుసుకునేందుకు పిలిచారు. అదే సమయంలో అలీరెజా ఓ నిర్ణయం తీసుకున్నాడు. తన ప్రియురాలు మహ్‌షద్ కషానీని పెళ్లి చేసుకోవాలని భావించాడు. మహ్‌షద్ కూడా జనవరి నిరసనలకు సంబంధించిన కేసులో జైలులోనే ఉంది. అయితే ఆమెను వేరే జైలులో ఉంచడంతో ఇద్దరికీ ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం లేకపోయింది. దీంతో అలీరెజా తరఫు న్యాయవాది ఫోన్ ద్వారా ఇద్దరినీ కలిపారు. వారి తండ్రుల అనుమతితో ఫోన్‌లోనే మతపరమైన వివాహ ప్రమాణాలు చేయించారు.

ఫోన్‌లోనే వివాహం

వివాహ సమయంలో ఒక పవిత్ర ఖురాన్ ప్రతితో పాటు ఒక క్యాండీ స్వీటు, ఒక ఎర్ర గులాబీని కట్నంగా నిర్ణయించారు.  వివాహానికి తల్లిదండ్రుల అనుమతి ఉందా అని న్యాయవాది అడగ్గా.. ఇద్దరూ అంగీకారం తెలిపినట్లు రికార్డు చేసిన ఆడియోను హక్కుల సంస్థలు విడుదల చేశాయి. అయితే ప్రత్యక్షంగా కలుసుకునేందుకు జైలు అధికారులు ఈ జంటను అనుమతించలేదు.

‘చివరిసారి కలుసుకునే అవకాశం ఇవ్వలేదు’

వివాహం జరిగితే ఉరిశిక్షను కొంతకాలం వాయిదా వేయచ్చని న్యాయవాదులు ఆశించారు. కానీ అధికారులు వధువు ఖైదీకి బంధువు కాదనే సాకు చెప్పి ప్రత్యక్షంగా పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. అందువల్ల ఇద్దరి వివాహం చట్టపరమైన ప్రక్రియగా జరిగినప్పటికీ.. వారు ఒకరి సమక్షంలో ఒకరు వివాహం చేసుకోలేకపోయారు.

మరుసటి రోజే ఉరిశిక్ష

అలీరెజా సెపాహీకి భయపడిన రోజు రానే వచ్చింది. అక్టోబర్ 5 ఉదయం ఇస్ఫహాన్ సెంట్రల్ జైలులో 25 ఏళ్ల అలీరెజాను ఉరితీశారు. అదే కేసులో 21 ఏళ్ల అలీరెజా రైసీని కూడా ఉరితీసినట్లు అధికారులు తెలిపారు. ఇరాన్‌లో జనవరి 8-9 తేదీల్లో తీవ్రస్థాయికి చేరిన నిరసనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ నిరసనలకు సంబంధించి ఇప్పటివరకు 34 మందిని ఉరితీసినట్లు ఇరాన్ హ్యూమన్ రైట్స్ (IHR) తెలిపింది.

మరణం తర్వాత కూడా విషాదమే..

అలీరెజా మరణంతో అతడి కుటుంబానికి విషాదం మరింత పెరిగింది. ఉరిశిక్ష అనంతరం అతడి మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించలేదు. ఇస్ఫహాన్‌లో అంత్యక్రియలకు బదులుగా సుమారు 200 కిలోమీటర్ల దూరంలోని కషాన్‌కు మృతదేహాన్ని తరలించినట్లు ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి మై సాటో తెలిపారు. ఉరిశిక్షకు ముందు తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలన్న అలీరెజా చివరి కోరిక నెరవేరినా.. ఆమెను చివరిసారిగా ప్రత్యక్షంగా చూసే అవకాశం మాత్రం అతడికి దక్కలేదు.