Reading Time: 2 minutes
Revanth Reddy: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. అప్పటివరకు పోరాటం ఆగదన్న సీఎం రేవంత్..

దేశ ప్రజల ఓటు హక్కును హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. దేశంలో ఓటు హక్కు ఉన్నవారు, లేనివారు అంటూ రెండు వర్గాలను సృష్టించే ప్రయత్నం జరుగుతోందని వాపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం ద్వారా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేస్తే.. ఆయనపై చర్యలు తీసుకోవడం దారుణమని రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గేలను అరెస్టు చేసిందని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని అన్నారు.

సైమన్‌ గో బ్యాక్‌ తరహాలో జీకే గో బ్యాక్‌

గతంలో సైమన్‌ గో బ్యాక్‌ ఉద్యమం దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిందని సీఎం గుర్తుచేశారు. ఇప్పుడు దేశంలో సర్‌ గో బ్యాక్‌, జీకే గో బ్యాక్‌ ఉద్యమం కొనసాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. గతంలో రైతుల ఉద్యమం సందర్భంగా మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించినా… చివరకు ప్రజల ఒత్తిడికి తలొగ్గి చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు కూడా ఎంత మొండిగా వ్యవహరించినా జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాల్సిందేనని పేర్కొన్నారు. అవసరమైతే ఈ వ్యవహారం మరింత ముందుకు వెళ్లి ప్రధాని రాజీనామా చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందని అన్నారు.

దేశ ప్రజల ఓటు హక్కును ఎవరూ లాక్కోలేరు

భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ఓటు హక్కును ఎవరూ లాక్కోలేరని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గతంలో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలను ఉపయోగించుకున్నారని, ఇప్పుడు నేరుగా ఎన్నికల సంఘాన్నే రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల ఓట్లను తొలగించి తమకు అనుకూలంగా ఎన్నికల ఫలితాలను మార్చే ప్రయత్నాలను కాంగ్రెస్‌ అడ్డుకుంటుందని చెప్పారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలపై పోలీసులు వ్యవహరించిన తీరును చూస్తే మోడీ, అమిత్‌షాల అసహనం స్పష్టంగా కనిపిస్తోందని సీఎం అన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, పదవులను కాపాడుకునేందుకు ప్రతిపక్ష నేతలపై పోలీసులను ప్రయోగిస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్‌ ఉద్యమం కాదు ఇది.. ప్రజల ఉద్యమం

దేశంలోని ప్రజలు జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. ప్రజల హక్కులను కాలరాసిన వారికి చరిత్రలో ఎవరూ తప్పించుకోలేదని, చివరకు ప్రజల కోర్టులోనే తీర్పు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు . ఇప్పటికైనా ప్రతిపక్షాల డిమాండ్‌ను అంగీకరించి జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు వీధుల నుంచి పార్లమెంట్‌ వరకు పోరాటం కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు. ఇది కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే పరిమితమైన ఉద్యమం కాదని, ఇండియా కూటమి, ప్రజల ఉద్యమమని అన్నారు. ప్రజలు ఒక్కటై గొంతెత్తితే ప్రభుత్వం తప్పనిసరిగా వినాల్సిందేనని, లేకపోతే ప్రజలే తగిన సమాధానం చెబుతారని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు కార్యకర్తలంతా ఐక్యంగా ముందుకు సాగుతారని, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సీఎం తెలిపారు.