
CM Chandrababu : చిత్తూరు జిల్లా కుప్పంలో స్థానిక రైతులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మీయ పలకరింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులకు భారీ ప్రయోజనం చేకూర్చేలా కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కాడా – KADA), ప్రముఖ దిగ్గజ సంస్థ ఐటీసీ (ITC) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. దీని ద్వారా ఇక్కడి పండ్లు, కూరగాయల క్లస్టర్ల ఉత్పత్తులను బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాలకు నేరుగా మార్కెటింగ్ చేయనున్నారు. అలాగే రైతులు ఆధునిక వ్యవసాయ విధానాలను అవలంబించేలా ‘విశాలాక్షి ఇన్నోవేషన్స్ సస్టెయినబుల్ వ్యాల్యూ చైన్’ సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, సాంకేతికతను జోడించి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారానే అధిక ఆదాయం, మెరుగైన దిగుబడి సాధించేందుకు ఆస్కారం ఉంటుందని, రైతులంతా ఈ మెరుగైన మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
టమాటో సాగుకు ఐటీసీ భారీ ప్రణాళికలు
నియంత్రిత వాతావరణంలో సుమారు 1,000 ఎకరాల్లో 10 వేల టన్నుల టమాటాలను పండించి అంతర్జాతీయంగా ఎగుమతి చేసేందుకు ఐటీసీ సంస్థ భారీ ప్రణాళికతో ముందుకు వచ్చిందని, ఇందుకు గాను రూ.8 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక సాగు కోసం ఆదర్శ రైతులు ఉత్సాహంగా ముందుకు రావాలన్నారు. ప్రస్తుతం కుప్పం ప్రాంతంలో పౌల్ట్రీ, డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏబీఐఎస్ (ABIS), మదర్ డెయిరీ, ఐటీసీ వంటి అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, దీని ద్వారా కుప్పంలో దాదాపు రూ.10 వేల కోట్ల మేర వివిధ ప్రాజెక్టులు రాబోతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఉద్యాన ఉత్పత్తుల సాగులో ఇప్పటికే రాయలసీమ దేశంలోనే నెంబర్ 1 స్థాయికి చేరుకుందని, దీనిని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
రూ.1 లక్ష కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ , ప్రైవేటు రంగాల భాగస్వామ్యంతో దాదాపు రూ.1 లక్ష కోట్ల మేర వ్యయంతో భారీ ప్రాజెక్టులను తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రభుత్వ రంగంలో రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తుండగా, ప్రైవేటు రంగంలో భారీగా ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులు , పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న పండ్లు, ఉద్యాన ఉత్పత్తులను కుప్పంలో సాగు చేసేలా పక్కా ప్రణాళికలు రచిస్తున్నామని, రైతులు ఆధునిక పరికరాలను ఉపయోగించాలని కోరారు. చివరగా, చిత్తూరు జిల్లా చిగురుగుంట వద్ద ఉన్న అంతర్గత బంగారు గనిని త్వరలోనే వెలికితీసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో వెల్లడించారు.