July 10, 2026

Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ ‘లగాన్’… మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!

Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ ‘లగాన్’… మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
Reading Time: 2 minutes
Lagaan Re Release Date Aamir Khans Classic Returns To Theatres For 25th Anniversary

Lagaan Re Release Date : సినిమాలు వస్తుంటాయి.. వెళ్తుంటాయి. అయితే కొన్ని చిత్రాలు మాత్రం జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. భారతీయ సినిమా చరిత్రలో అలాంటి అరుదైన క్లాసిక్‌ల జాబితాలో ముందువరుసలో నిలిచే చిత్రం ‘లగాన్’. విడుదలై పాతికేళ్లు పూర్తవుతున్నా ఈ సినిమా ప్రభావం ఇప్పటికీ తగ్గలేదు. ఇప్పుడు ఈ ఐకానిక్ స్పోర్ట్స్ డ్రామా తన 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక తరం థియేటర్లలో ఆస్వాదించిన ఈ అద్భుతాన్ని, కొత్త తరం కూడా వెండితెరపై చూసే అవకాశం దక్కబోతోంది.

2001లో విడుదలైన ‘లగాన్’ అప్పటి బాలీవుడ్‌లో ఒక సంచలనం సృష్టించింది. కమర్షియల్ ఫార్ములాలకు భిన్నంగా, బ్రిటిష్ పాలన నేపథ్యంలో క్రికెట్‌ను మైన్ పాయింట్ గా తీసుకుని రూపొందించిన ఈ చిత్రం మొదట్లో చాలామందికి సాహసోపేత ప్రయత్నంలా కనిపించింది. అయితే విడుదలైన తర్వాత ప్రేక్షకులు మాత్రమే కాదు, విమర్శకులు కూడా ఈ సినిమాను ప్రశంసలతో ముంచెత్తారు. అదే సమయంలో కొత్తగా ప్రారంభమైన ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌కు ఇది మంచి గుర్తింపును తీసుకొచ్చింది.

దర్శకుడు అశుతోష్ గోవారికర్ తెరకెక్కించిన ఈ చిత్రం భారతదేశంలో బ్రిటిష్ పాలన, క్రీడలు, దేశభక్తిని అద్భుతంగా మేళవించింది. గ్రామస్థులపై విధించిన భారమైన పన్ను నుంచి విముక్తి పొందేందుకు క్రికెట్ మ్యాచ్ ఆడే సవాల్‌ను స్వీకరించిన భువన్ పాత్రలో ఆమిర్ ఖాన్ అద్భుతమైన నటన కనబరిచారు. ఆయనతో పాటు గ్రేసీ సింగ్, పాల్ బ్లాక్‌థార్న్, రాచెల్ షెల్లీ, రఘుబీర్ యాదవ్, రాజేష్ వివేక్ తదితరులు తమ పాత్రలకు ప్రాణం పోశారు.

ఈ సినిమా విజయానికి మరో ప్రధాన బలం సంగీతం. సంగీత దిగ్గజం A. R. Rahman అందించిన పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ప్రేక్షకుల హృదయాలకు చేరవేసిన ఆ సంగీతం భారతీయ సినిమా చరిత్రలో అత్యంత గుర్తుండిపోయే ఆల్బమ్‌లలో ఒకటిగా నిలిచింది. భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపై మరింత బలంగా నిలబెట్టిన చిత్రంగా కూడా ఇది గుర్తింపు పొందింది. ఉత్తమ విదేశీ భాషా చిత్ర విభాగంలో అకాడమీ అవార్డు నామినేషన్ దక్కించుకోవడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

ఇప్పుడు ఈ క్లాసిక్ మూవీ రజతోత్సవాన్ని పురస్కరించుకుని 2026 జూన్ 12, 13, 14 తేదీలలో మూడు రోజుల పాటు ప్రత్యేకంగా థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. పాత అభిమానులకు ఇది మరోసారి ఆస్వాదించే అవకాశం కాగా, కొత్త తరం ప్రేక్షకులకు భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయిన ఒక అద్భుతమైన కథను పెద్ద తెరపై చూసే అరుదైన అవకాశం. పాతికేళ్లు గడిచినా ‘లగాన్’ మ్యాజిక్ ఏమాత్రం తగ్గలేదని ఈ రీ రిలీజ్ మరోసారి నిరూపించబోతోంది.