
ఢిల్లీ: పరీక్షా పత్రం లీక్ కావడంతో రద్దయిన నీట్ పరీక్షను జూన్ 21, 2026న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ పరీక్షకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం అభ్యర్థులు, తల్లిదండ్రులు కేవలం NTA అధికారిక సోషల్ మీడియా ఖాతాలను, వెబ్సైట్ను మాత్రమే పరిశీలించాలని NTA సూచించింది. భారత ప్రభుత్వ ఆమోదంతో.. NTA జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం.. నీట్-యూజీ 2026 పునఃపరీక్ష 2026 జూన్ 21, ఆదివారం రోజు జరుగుతుంది.
📢 NEET (UG) 2026 — Examination Date Announced
The National Testing Agency, with the approval of the Government of India, has scheduled the re-examination of NEET (UG) 2026 on Sunday, 21 June 2026.
Candidates and parents are requested to rely only on the official channels of NTA.…— National Testing Agency (@NTA_Exams) May 15, 2026
పేపర్ లీక్ కారణంగా NTA భద్రతా వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తిన తరుణంలో ఈసారి మరింత కట్టుదిట్టంగా పరీక్ష నిర్వహించాలని NTA పట్టుదలగా ఉంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, మెసేజింగ్ గ్రూపులలో ప్రచారంలో ఉండే పుకార్లను, ధృవీకరించని సమాచారాన్ని నమ్మవద్దని NTA విద్యార్థులకు సూచించింది. పరీక్షా ప్రక్రియకు సంబంధించిన సందేహాల కోసం అభ్యర్థులు NTA యొక్క అధికారిక హెల్ప్‌లైన్ నంబర్లు-011-40759000, 011-69227700 ద్వారా సంప్రదించవచ్చు. సందేహాలను neet-ug@nta.ac.in అనే ఈమెయిల్కు కూడా పంపవచ్చని సూచించింది.
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) 2026 ఈసారి మరింత కట్టుదిట్టంగా జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. మన రాష్ట్రం నుంచి 73 వేలకు పైనే మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్స్కు అప్లై చేశారు. రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 199 సెంటర్లను ఏర్పాటు చేశారు.
ఎగ్జామ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. 1:30 గంటలకే గేట్లు మూసివేస్తామని, ఆ తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు. కాగా, దేశవ్యాప్తంగా 566 నగరాల్లో ఈ మెగా ఎగ్జామ్ జరగనుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 22.79 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాయనున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి మెయిన్ సిటీలతో పాటు కొత్తగా ఆసిఫాబాద్, భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల, జనగాం, కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, జగిత్యాల వంటి జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.