Reading Time: 2 minutes
Off The Record Over Mp Paka Satyanarayana

కష్టానికి తగిన గుర్తింపు దక్కినా.. ఇమేజ్ పెంచుకునే విషయంలో ఆ ఎంపీ ఎందుకో వెనకబడ్డారా? కార్యకర్త స్థాయి నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎదిగినా.. ఆయన అసంతృప్తి రాగం ఆలపిస్తున్నారా? తాజా ఎన్నికల్లో గెలిచి దేశమంతా కమలం పార్టీ సంబరాల్లో చేసుకుంటుంటే…ఆయన మాత్రం ఇంటికే పరిమితం కావడంలో అర్థమేంటి? ఆ ఎంపీ వ్యవహారం ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అనడానికి ఉదాహరణగా కనిపిస్తోందా? ఇంతకీ ఆ మరో కత్తి ఎవరు? ఆ ఎంపీ ఎవరు?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో బిజెపి తరఫున ద మోస్ట్ సీనియర్ లీడర్ కం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు పాకా సత్యనారాయణ. 1976 నుంచి RSSతో అనుబంధం. 2018-2021 వరకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, పార్టీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్‌గా పనిచేశారు పాకా. అలాంటి సీనియర్ లీడర్ చేసిన సేవలను గుర్తించి రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించింది బిజెపి. అయితే పదవి వచ్చిన మొదట్లో భీమవరంలో జరిగిన అన్ని కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్న ఎంపీ పాకా…ఇప్పుడు ఎందుకో వెనుకబడ్డారు అనే విమర్శలు వినిపిస్తున్నాయట.

మోస్ట్ సీనియర్ లీడర్ , ఎంపీ వెనుకబడ్డారు అనే విమర్శలు రావడానికి కారణం ఇటీవల భీమవరంలో జరిగిన పలు పార్టీ కార్యక్రమాల్లో ఆయన హాజరు కాకపోవడమే అనేది పార్టీ లోకల్ నాయకుల టాక్. పశ్చిమ బెంగాల్లో పార్టీ విజయం సాధించి భీమవరంలో జరిగిన ఎన్నికల విజయోత్సవ ర్యాలీలు, పాలాభిషేకం కార్యక్రమాల్లో ఎంపీ పాకా హాజరు కాలేదు. ఆయన అటెండ్ కాకపోవడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కార్యక్రమాలకు పిలిచినా రాలేదనేది పార్టీ నాయకుల మాటయితే ఆహ్వానం అందలేదనేది ఆయన వాదనగా తెలుస్తోంది. దీంతో గ్యాప్ ఎక్కడ వచ్చిందో అర్థం కాక అక్కడి పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారని సమాచారం. భీమవరంలో జరిగే కార్యక్రమాల విషయం పక్కనపెడితే నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు వంటి నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలకు మాత్రం ఆయన అటెండ్ అవుతూ వస్తున్నారట.

అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా ఒకే ప్రాంతం నుంచి అదికూడా భీమవరం నుంచి ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న వేళ…అక్కడ పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన సమయంలో రాజ్యసభ సభ్యులు పాక ఎందుకు దూకుడు పెంచడం లేదని చర్చ హాట్ టాపిక్ గా నడుస్తుందట. 2024 ఎన్నికల్లో నరసాపురం తరపున బిజెపి ఎంపీగా గెలిచి కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాస వర్మ ఓవైపు తన కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతుంటే, ఆయా కార్యక్రమాలకు మరో ఎంపీ పాక హాజరు కాకపోవడం వెనుక ఏదైనా గ్యాప్ ఉందా అనే చర్చకు భీమవరంలో తెరలేసింది. పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసి ఎంపీలుగా అవకాశం దక్కించుకున్న నేతలు ఎడమొహం పెడముఖంగా ఉంటున్నారా అనే అనుమానాలు తెరపైకొస్తున్నాయట.. ఇలా చేయడం వల్ల కష్టానికి తగ్గ ఫలితం దక్కినా.. పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లే విషయంలో వెనకబడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయట..

ఇద్దరు ఎంపీలు కలిసి పనిచేసే విషయంలో సమన్వయ లోపం ఉందా లేక సమాచార లోపం ఉందో తెలియదు గానీ…దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే చోట నుంచి ఇద్దరు ఎంపీల ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతంలో ఆ పార్టీకి ఆశించిన మైలేజ్ రావడంలేదని టాక్ మాత్రం నడుస్తుందట. గతంలో క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర చైర్మన్ గా పని చేసిన ఎంపీ పాకాలో ఉన్న అసంతృప్తిని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తారా లేక భవిష్యత్తులో తప్పులు జరగకుండా , సమన్వయ లోపం లేకుండా ఉండే విధంగా క్యాడర్ తో కలిసి చర్చిస్తారా.. లేక ఇదే తంతు కొనసాగిస్తారో….కాలమే సమాధానం చెప్పాలంటున్నారు కార్యకర్తలు.