Reading Time: < 1 minute
Tamil Nadu Vijay Meets Governor Submits Support Letters For Government Formation

హమ్మయ్య.. ఎట్టకేలకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను విజయ్ కలిశారు. దీంతో 120 ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేశారు. విజయ్ అందజేసిన మద్దతు లేఖలను గవర్నర్ పరిశీలిస్తున్నారు. పరిశీలన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలా? వద్దా? అని తేల్చనున్నారు.

కొద్దిసేపటి క్రితమే వీసీకే, ముస్లిం లీగ్ పార్టీలు విజయ్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. దీంతో విజయ్ బలం 120కి చేరింది. ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. గత 6 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ తెర పడనుందా? లేదా? అన్నది మరికొద్దిసేపట్లో తేలిపోనుంది.

సోమవారం వెలువడిన ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే మాత్రమే 108 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించవచ్చని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా అంచనాలు తారుమారయ్యాయి. పూర్తి మ్యాజిక్ ఫిగర్‌తో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని విజయ్‌కు సూచించారు. దీంతో కాంగ్రెస్, వామపక్షాల మద్దతు ఇవ్వడంతో విజయ్ బలం 116కు చేరింది. అయితే మరో రెండు స్థానాలు ఉన్న వీసీకేకు చెందిన పార్టీ మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తగ్గింది. దీంతో మ్యాజిక్ ఫిగర్‌కు విజయ్ చేరుకోకపోవడంతో రాజకీయ అనిశ్చితి అలానే కొనసాగుతోంది. మొత్తానికి శనివారం వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వీసీకేతో పాటు ముస్లిం లీగ్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. దీంతో విజయ్ బలం 120కి చేరింది.

వాస్తవంగా ఈరోజు రాత్రి గవర్నర్ కేరళం వెళ్లేందుకు రెడీ అయ్యారు. దీంతో విజయ్‌కు తొలుత అపాయింట్ ఇవ్వలేదు. దీంతో లోక్‌భవన్‌కు వెళ్లి విజయ్ తిరిగి వచ్చేశారు. మొత్తానికి చివరి నిమిషంలో గవర్నర్ మనసు మార్చుకున్నారు. కేరళం టూర్ రద్దు చేసుకున్నారు. దీంతో విజయ్‌కు సాయంత్రం 6:30 గంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు.