Reading Time: 2 minutes
Narendra Modi Honours Bjp Veteran Makhan Lal Sarkar At Kolkata Event

PM Modi: కోల్‌కతాలో నేడు జరిగిన సువేందు అధికారి ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వేదికపై ఉన్న ఓ 97 ఏళ్ల వృద్ధుడిని ప్రధాని మోడీ గమనించారు. నేరుగా ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లి కాళ్లకు నమస్కారం చేశారు. అనంతరం ఆలింగనం చేసుకున్నారు. దీంతో ప్రధాని స్వయంగా కాళ్లు మొక్కిన ఆ వృద్ధుడు ఎవరు? అనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమైంది. ఆయన ఎవరో కాదు.. బీజేపీ తొలి తరం నేతల్లో ఒకరైన సిలిగురికి చెందిన మఖన్ లాల్ సర్కార్. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీకి మఖన్ లాల్ అత్యంత సన్నిహితుడు.

శ్యామ ప్రసాద్ ముఖర్జీ కశ్మీర్ జైలులో అనుమానాస్పద స్థితిలో మరణించినప్పుడు, ఆయన చివరి యాత్రలోనూ సర్కార్‌ తోడుగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో ఒక దేశభక్తి గీతాన్ని పాడినందుకు ఢిల్లీ పోలీసులు సర్కార్‌ను అరెస్టు చేశారు. కోర్టులో క్షమాపణలు చెప్పమని జడ్జి కోరగా, “నేను ఏ తప్పూ చేయలేదు, కేవలం పాట మాత్రమే పాడాను” అని నిరాకరించారు. అప్పుడు జడ్జి ఆ పాటను మళ్లీ పాడమని కోరగా, ఆయన కోర్టులోనే ఆ పాట వినిపించారు. దాంతో ప్రభావితుడైన జడ్జి.. ఆయనకు ఫస్ట్ క్లాస్ టికెట్ కొనిచ్చి, ఇంటికి వెళ్ళడానికి 100 రూపాయలు ఇవ్వాలని పోలీసులను ఆదేశించారట.

ఇక, 1952లో శ్యామ ప్రసాద్ ముఖర్జీ కశ్మీర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి వెళ్లినప్పుడు, ఆయన వెంట ఉన్న అతికొద్ది మందిలో మఖన్ లాల్ ఒకరు. ఆ సమయంలోనే కశ్మీర్‌లో అరెస్టు చేశారు. 1980లో బీజేపీ ఆవిర్భవించిన తర్వాత.. వెస్ట్ దినాజ్‌పూర్, జల్పాయ్‌గురి, డార్జిలింగ్ జిల్లాలకు కోఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టి, కేవలం ఏడాదిలోనే 10,000 మంది సభ్యులను పార్టీలో చేర్పించారు. సిలిగురి జిల్లా బీజేపీ మొదటి అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, 1981 నుంచి వరుసగా ఏడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. సాధారణంగా పార్టీ నిబంధనల ప్రకారం ఒకే వ్యక్తి రెండేళ్లకు మించి పదవిలో ఉండటం కష్టమైన ఆ రోజుల్లో, ఆయన ఏడేళ్ల పాటు అధ్యక్షుడిగా ఉండటం ఒక రికార్డు. 97 ఏళ్ల వయసులోనూ జాతీయవాద భావజాలానికి నిలువెత్తు రూపంగా నిలిచిన మఖన్ లాల్ సర్కార్‌కు ప్రధాని మోడీ అందించిన గౌరవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాతతరం కార్యకర్తలకు పార్టీ ఇచ్చే విలువకు ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.