Team India: ఓవైపు భారీ ఓటములు.. మరోవైపు అత్యంత చెత్త రికార్డులు.. ఈ టీమిండియాకు ఏమైంది!

Team India Unwanted Records in England: ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలలో టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ అయిన భారత జట్టు ఘోర పరాజయాలను చవిచూసింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో అయినా శ్రేయస్ సేన గెలుస్తుందని భావించినా.. అది జరగలేదు. భారత్ 56 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల పరంగా భారత్ ఎదుర్కొన్న అతిపెద్ద పరాజయాల జాబితాలో ఈ ఓటమి నాలుగో స్థానంలో నిలిచింది.
2026లో నాటింగ్‌హోమ్‌లో ఇంగ్లండ్ చేతిలో భారత్ 125 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. భారత్‌కు టీ20ల్లో అత్యంత భారీ పరాజయం ఇదే. 2019లో వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్ చేతిలో 80 పరుగుల తేడాతో ఓడింది. 2026లో అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం చవిచూసింది. తాజాగా సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్ చేతిలో 56 పరుగుల తేడాతో ఓడింది. 2025లో న్యూ చండీగఢ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన 51 పరుగుల ఓటమి ఈ జాబితాలో తర్వాతి స్థానంలో ఉంది.
ఇంగ్లండ్ పర్యటనలో భారత్ మరో చెత్త రికార్డును కూడా నమోదు చేసింది. 2026 ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఏకంగా నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఒకే టీ20 సిరీస్ లేదా టోర్నమెంట్‌లో భారత్ ఎదుర్కొన్న అత్యధిక పరాజయాలు ఇవే. గతంలో 2009లో ఇంగ్లండ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. 2010లో వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ టీమిండియాకు మూడు పరాజయాలు ఎదురయ్యాయి. 2023 వెస్టిండీస్ పర్యటనలో కూడా భారత్ మూడు టీ20 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. అయితే 2026 ఇంగ్లండ్ పర్యటనలో నాలుగు పరాజయాలతో ఆ చెత్త రికార్డును అధిగమించింది.
వరుస భారీ ఓటములతో ఇంగ్లండ్ పర్యటన టీమిండియాకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ముఖ్యంగా ఒకే సిరీస్‌లో నాలుగు పరాజయాలు ఎదురవడం భారత టీ20 చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ పరాజయాలు భారత టీ20 జట్టుకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. భారీ ఓటములతో పాటు వరుసగా చెత్త రికార్డులు నమోదవుతుండటం జట్టు ప్రదర్శనపై సోషల్ మీడియాలో మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. ‘ఈ టీమిండియాకు ఏమైంది?’ అంటూ ఫాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జట్టులో భారీ ప్రక్షాళన చేయాలని, కోచ్ గౌతమ్ గంభీర్‌పై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.