July 12, 2026

Divya Bharathi : పరిచయాల కంటే.. పట్టుదలే ముఖ్యం.. నటి దివ్యభారతి రియల్ సక్సెస్ స్టోరీ!

Divya Bharathi : పరిచయాల కంటే.. పట్టుదలే ముఖ్యం.. నటి దివ్యభారతి రియల్ సక్సెస్ స్టోరీ!
Reading Time: 2 minutes

Divya Bharathi : పరిచయాల కంటే.. పట్టుదలే ముఖ్యం.. నటి దివ్యభారతి రియల్ సక్సెస్ స్టోరీ!

Caption of Image.

కొన్ని విజయాల వెనుక గొప్ప పరిచయాలు ఉంటాయి. మరికొన్ని విజయాలు మాత్రం త్యాగం, నమ్మకం, ఓర్పు, నిరంతర ప్రయత్నం మీద నిలబడుతాయి. నటి దివ్యభారతి సినీ ప్రయాణం అలాంటి కథల్లో ఒకటి. రీసెంట్‌గా లింగం అనే తమిళ్ సినిమాలో నటించిన దివ్య, తన పాత్రకు మంచి ప్రశంసలు అందుకుంది.

తమిళనాడులోని కోయంబత్తూరులో పెరిగిన దివ్యభారతికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టమే. కానీ సినిమా రంగంలోకి రావాలనే లక్ష్యంతోరిగిన అమ్మాయి కాదు. ఇంట్లో సినిమా నేపథ్యం లేదు. నిర్మాతలు, దర్శకులు, నటులతో పరిచయాలు లేవు. కుటుంబ బాధ్యతలను తన తల్లి ఒంటరిగానే మోసి తనను చదివించారని ఆమె ఎన్నోసార్లు గుర్తుచేసుకుంది. తన జీవితంలో వచ్చిన ప్రతి అవకాశానికి తల్లి చేసిన త్యాగమే పునాది అని ఆమె చెప్పింది.

చదువే మొదటి ప్రాధాన్యం

చిన్నప్పటి నుంచే చదువుకు ప్రాధాన్యం ఇచ్చిన దివ్యభారతి, సత్యమంగళంలోని ఈరోడ్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఐటీ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తిచేసింది. చదువు పూర్తి య్యాక చాలామందిలాగే ఉద్యోగం గురించి ఆలోచించింది. అయితే కాలేజీ రోజుల నుంచి ఫొటో షూట్‌లు, ఫ్యాషన్ షోల్లో పాల్గొనడం వల్ల ఆమె ఆసక్తి క్రమంగా ఆ రంగం వైపు మళ్లింది. ఆ ఆసక్తి ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.

అందాల పోటీల నుంచి నటన వైపు

2015లో జరిగిన పలు అందాల పోటీల్లో విజేతగా నిలిచి గుర్తింపు తెచ్చుకుంది. 2016లో ‘ఫేస్ ఆఫ్ కోయంబత్తూర్’ బిరుదు కూడా అందుకుంది. అయితే ఈ విజయాలు వచ్చిన వెంటనే సినిమా అవకాశాలు రాలేదు. గుర్తింపు రావడం ఒకటి, అవకాశాలు ఇవ్వడం మరొకటి అని అప్పుడే ఆమెకు అర్థమైంది. తర్వాత యాక్టింగ్ అకాడెమీ, మోడలింగ్‌లలో కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తూ గడిపిన రోజులు ఎన్నో ఉన్నాయి. అవి ఆమెకు నిరాశాన్ని చేర్చాయని అంటోంది దివ్య.

సినిమాల్లోకి రావాలా? వద్దా?

మోడలింగ్ రంగంలో రాణించాలా? వద్దా? అనే సందేహం తనకు ఉండేదని దివ్యభారతి ఓ సందర్భంలో చెప్పింది. కానీ ‘బ్యాచిలర్’ కథ విన్న తర్వాత ఆమె ఆలోచన మారింది. పాత్ర నచ్చడంతో స్క్రీన్ టెస్ట్‌లో పాల్గొంది. అందులో తను ఎంపికైంది. అలా ఆమె తొలిసినిమా ప్రారంభమైంది. మొదటి సినిమానే కావడంతో దాన్ని ఎంతో సీరియస్‌గా తీసుకుంది. దాదాపు మూడు నెలలపాటు నటనలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. పాత్రను అర్థం చేసుకోవడం, భావోద్వేగాలను సహజంగా వ్యక్తం చేయడం, కెమెరా ముందు సమర్థంగా నటించడం నేర్చుకుంది. ఎంతో హార్డ్ వర్క్ చేసింది.

పాత్రల ఎంపికలో రాజీ లేదు

‘బ్యాచిలర్’ తర్వాత ఆమె సినిమాలతో పాటు డిజిటల్ ప్లాట్ఫాం కోసం రూపొందించిన వెబ్‌సిరీస్‌లలో నటించింది. తిరుప్ప సినిమాలే చేసినా, తనకు నచ్చిన పాత్రలనే ఎంచుకోవాలనే నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేదు. త్వరగా ఎక్కువ సినిమాలు చేయడం కంటే, నటిగా గుర్తింవుపోయే పాత్రలు చేయాలనే ఆలోచనతోనే ముందుకు సాగుతున్నట్టు ఆమె చాలాసార్లు చెప్పింది.

‘లింగం’తో ఫాంటసీ

ఆమె తాజా ప్రయాణంలో మరో ముఖ్యమైన అడుగు ‘లింగం’. ఇందులో పొన్సెలర్ పాత్రలో కనిపించింది. బయటకు ప్రశాంతంగా కనిపించే ఈ పాత్రలో లోపల ధైర్యం, నిదానం, మనోబలం దాగి ఉంటాయి. ఈ పాత్ర గురించి మాట్లాడిన దివ్యభారతి.. భావోద్వేగాలను మాటలకంటే చూపులతోనే ఎక్కువగా వ్యక్తం చేయాల్సి వచ్చిందని తెలిపింది. అందుకే పాత్రను పూర్తిగా అర్థం చేసుకోవడానికి దర్శకుడితో చాలాసార్లు చర్చించినట్లు చెప్పింది. ప్రతి సన్నివేశాన్ని సహజంగా చేయాలనే ఉద్దేశంతోనే నటించానని, షూటింగ్‌ టైంలో సహనటులు, మూవీ టీం అందించిన సహకారం తనను ఎంతో ఉపయోగపడిందని తెలిపింది.

జర్నీ కొనసాగుతూనే ఉంది..

దివ్యభారతి కథలో సంచలనాలు కనిపించవు. కానీ నిశ్శబ్దంగా సాగిన ఒక ప్రయాణం కనిపిస్తుంది. కోయంబత్తూరులో ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఒక అమ్మాయి.. మోడలింగ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అందాల పోటీల్లో గుర్తింపు సంపాదించింది. ఎన్నో ఆడిషన్స్ చేసింది. తనకు వచ్చిన తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. అవకాశం కోసం ఎదురుచూడటం ఒక పరీక్ష అయితే, ఆ అవకాశం వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం మరో పరీక్ష. ఈ రెండు పరీక్షల్లోనూ ఓర్పు, క్రమశిక్షణ, నమ్మకం ఉంటేనే ప్రయాణం ముందుకు సాగుతుంది అని ఆమె జర్నీ చెప్పింది.

ప్రయాణం పూర్తికాలేదు..

‘బ్యాచిలర్’ విడుదలైన తర్వాత దివ్యభారతికి మంచి గుర్తింపు వచ్చింది. కొత్త కథానాయికగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కానీ మొదటి సినిమా విజయం తర్వాత అవకాశాలు వరుసగా వస్తాయని అనుకున్న ఆమెకు త్వరలోనే వాస్తవం అర్థమైంది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… “మొదటి సినిమా విజయవంతమైతే తర్వాత అవకాశాలు వాటంతట అవే వస్తాయని అనుకున్నాను. కానీ ప్రతి ప్రయత్నానికి మళ్లీ ప్రయత్నించాల్సిందేనని తర్వాత అర్థమైంది” అని చెప్పింది. ఆ ఒక్క మాటే ఆమె సినీ ప్రయాణాన్ని అద్దంలా చూపిస్తుంది.

 

©️ VIL Media Pvt Ltd.