Reading Time: < 1 minute
ఒక్క ఓటు.. ఏకంగా మంత్రినే కుర్చీ నుంచి దింపేసింది.. తమిళనాడులో ఈ ఫలితం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ వజ్రాయుధమేనని తమిళనాడు ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయి. కేవలం ఒక్కటంటే ఒక్క ఓటు తేడాతో ఒక రాష్ట్ర మంత్రి ఓటమి పాలుకావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ ఎన్నికల్లో టీవీకే అద్భుత విజయంతో రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. తమిళనాడు సహకార శాఖ మంత్రి, సీనియర్ నాయకుడు కె.ఆర్. పెరియకరుప్పన్ తిరుపత్తూరు నియోజకవర్గంలో ఊహించని పరాజయాన్ని చవిచూశారు. టీవీకే అభ్యర్థి శ్రీనివాస్ సేతుపతి చేతిలో ఆయన కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో టీవీకే అభ్యర్థి శ్రీనివాస్‌కు 83,375 ఓట్లు రాగా, మంత్రి పెరియకరుప్పన్‌కు 83,374 ఓట్లు వచ్చాయి. బీజేపీకి చెందిన తిరుమరన్ కె.సి. 29,054 ఓట్లతో మూడవ స్థానానికి పరిమితమయ్యారు.

మస్కట్ నుంచి వచ్చి..

ఈ ఒక్క ఓటుకు సంబంధించి నెట్టింట ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. నటుడు విజయ్‌కి వీరాభిమాని అయిన ఒక యువతి, కేవలం తన అభిమాన నాయకుడి పార్టీ కోసం ఓటు వేయడానికి మస్కట్ నుండి విమానంలో తమిళనాడుకు వచ్చిందని, ఆమె వేసిన ఆ ఒక్క ఓటు వల్లే అక్కడ టీవీకే అభ్యర్థి శ్రీనివాస్ సేతుపతి విజయం సాధించారని ప్రచారం జరుగుతోంది. విజయ్ ఫ్యాన్స్‌ అంటే మామూలుగా ఉండదు అంటూ ఫ్యాన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

టీవీకే ప్రభంజనం

మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల లెక్కింపు పూర్తయ్యేసరికి, తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 108 స్థానాలను గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. డీఎంకే కూటమి 73 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. అన్నాడీఎంకే 53 స్థానాల్లో విజయం సాధించింది. కాగా ఒక్క ఓటు రాజకీయ ముఖచిత్రాన్ని ఎలా మార్చగలదో పెరియకరుప్పన్ ఓటమి స్పష్టం చేస్తోంది.