
తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ రాక ఖరారైంది. మే 10వ తేదీన ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా రాష్ట్రానికి రాబోతున్నారని తెలిపారు.
ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రధాని పెద్దపీట వేయనున్నారని చెప్పారు కిషన్ రెడ్డి. సుమారు రూ. 7,700 కోట్ల నుంచి రూ. 8,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారని చెప్పారు.. ముఖ్యంగా హైదరాబాద్ – యాదగిరిగుట్ట మధ్య ఎంఎంటీఎస్ (MMTS) పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు
రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల విస్తరణపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రూ. 85 వేల కోట్ల రైల్వే పనులు పురోగతిలో ఉన్నాయని, కాజీపేట రైల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు 90 శాతం పూర్తయ్యాయని ఆయన తెలిపారు.
మరోవైపు విద్య, వైద్య రంగాల్లోనూ కీలక పురోగతి కనిపిస్తోంది. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అలాగే రూ. 400 కోట్లతో నిర్మిస్తున్న నేషనల్ సైన్స్ సెంటర్ ద్వారా డిఫెన్స్, ఫార్మా, మెడికల్ రీసెర్చ్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ట్రిపుల్ ఆర్ (RRR) సౌత్ పార్ట్ డీపీఆర్ కు కు కేంద్ర కేబినెట్ ఆమోదం పొందాల్సి ఉందన్నారు కిషన్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లాలో రూ. 3,175 కోట్ల విలువైన నేషనల్ హైవే పనులను మోదీ ప్రారంభిస్తారని చెప్పారు.