Reading Time: < 1 minute

ఇంధన కొరతపై పుకార్లు నమ్మొద్దు..నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: మంత్రి ఉత్తమ్

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఎలాంటి కొరత లేదని, ప్రజలకు కావాల్సినంత ఇంధనం అందుబాటులో ఉన్నదని రాష్ట్ర సివిల్ సప్లయీస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఇంధన కొరతపై వస్తున్న పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇంధన సరఫరాను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు.

ఫిర్యాదుల కోసం 1967 టోల్‌‌‌‌‌‌‌‌ఫ్రీ నంబర్‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఎక్కడైనా సరఫరాలో అంతరాయం తలెత్తితే వెంటనే కలెక్టర్ల ఆధ్వర్యంలో మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఇంధన రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, వ్యవసాయ అవసరాలకు డీజిల్ సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టినట్లు వివరించారు.

సాధారణ సరఫరాతో పోలిస్తే ప్రస్తుతం డీజిల్ సరఫరాను 210 శాతం, పెట్రోల్ సరఫరాను 132 శాతం పెంచినట్లు తెలిపారు. రోజుకు సగటున 36,404 కిలోలీటర్ల పెట్రోల్, డీజిల్ సరఫరా జరుగుతోందని, ఇది సాధారణ స్థాయికంటే సుమారు 175 శాతం అధికమని పేర్కొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.