Reading Time: < 1 minute

పాపం విజయ్.. ఎన్నికలు జరగక ముందే ఎడప్పాడి సీటు కోల్పోయిన టీవీకే పార్టీ !

Caption of Image.

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఎడప్పాడి నుంచి టీవీకే బరిలో నిలిపిన విజయ్ పార్టీ అభ్యర్థి ఎం.అరుణ్ కుమార్ నామినేషన్ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఆయనకు ప్రత్యామ్నయంగా బరిలో నిలిపిన మహిళా అభ్యర్థి నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. నామినేషన్ పత్రాలపై అభ్యర్థిగా అతనిని ప్రతిపాదిస్తూ 10 మంది సంతకాలు ఉండాలి. 

అయితే.. అరుణ్ కుమార్ నామినేషన్ పత్రాలపై ఎనిమిది మంది సంతకాలు మాత్రమే ఉన్నాయి. ఆయనకు ప్రత్యామ్నయంగా టీవీకే నిలబెట్టిన నిత్య అనే మహిళ నామినేషన్ పత్రాలపై కేవలం ఏడుగురు మాత్రమే సంతకాలు చేశారు. ఇలా.. ఎడప్పాడి నుంచి టీవీకే పోటీలో నిలిపిన ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురి కావడం గమనార్హం. నామినేషన్ల పరిశీలన గడువు కూడా ముగిసింది. 

ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. టీవీకే అభ్యర్థి అరుణ్ కుమార్ కనిపించకుండాపోయాడు. అతనిని ప్రత్యర్థి పార్టీ కిడ్నాప్ చేయించిందని టీవీకే ఆరోపించింది. నామినేషన్ల పరిశీలనకు అభ్యర్థి తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉన్న క్రమంలో.. అరుణ్ కుమార్ హాజరు కాలేదు. 

ఇదిలా ఉండగా.. ఎడప్పాడి నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా కె.పళనిస్వామి పోటీలో నిలిచారు. ఎడప్పాడి నుంచి పళనిస్వామి వరుసగా ఆరోసారి బరిలో నిలిచారు. డీఎంకే నుంచి సీ.కాశీ అనే అభ్యర్థి పోటీ చేస్తున్నారు. తమిళనాడులోని 234 స్థానాల్లో బరిలో నిలిచిన విజయ్ టీవీకే పార్టీకి ఎన్నికలు జరగక ముందే ఎడప్పాడి సీటు దూరమవడం గమనార్హం. తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 4న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం వెల్లడించనుంది.

©️ VIL Media Pvt Ltd.